ఫీడులు:
టపాలు
వ్యాఖ్యలు

ఒక జఫ్ఫా ప్రేమ కథ!

“ఏంటిరా అలా ఉన్నావ్!? ఏమైంది?”

“మన విషయం ఇంట్లో తెల్సిపోయిందిరా :(

“అవునా, అదెలా రా? ఏమైంది అసలు??”

“ఏమో రా, ఎలా తెల్సిందో! మా మమ్మీ నీ గురించి అడిగింది”

“ఏం చెప్పావ్రా మరి?”

“నీకు నేనంటే ఇష్టమని చెప్పా!”

“ఓహ్! గుడ్ రా! ఎప్పటికైనా చెప్పాల్సిందేగా! :D ఇంతకీ ఆమె ఎమన్నారు?”

“మరి నీకు ఇష్టమా కాదా అని అడిగారురా!”

“మరి నువ్వేమన్నావ్!?”

“ఒక ఫ్రెండ్లా ఇష్టమని చెప్పా!”

తుస్..

.

.

.

.

.

మళ్ళీ బకరా అయిపోయాను. చిన్నప్పుడెప్పుడో అంత ఘాఢంగా ప్రేమించిన శ్రీదేవి దక్కకపోయేసరికి మళ్ళీ నాలుగో తరగతిదాక ఏ అమ్మాయిని కన్నెత్తి కూడా చూడలేదు. దానితో నా చదువు భలే సాఫీగా సాగుతూ క్లాస్ ఫష్టు కూడా తెచ్చుకున్నాను. మా మాస్టారు కూడా బడి ఎగ్గొట్టడానికి నేనెన్ని కుంటి సాకులు చెప్పినా నమ్మేంత “నమ్మకం” కల్పించుకున్నాను!

 

సరిగ్గా అప్పుడే రామాయణంలో మాయ లేడిలా ఒక “లేడీ” మా స్కూల్లో అడుగుపెట్టింది. ఆ అమ్మాయి పేరు రాణి(పేరు మార్చానులెండి :p),ఆ రాణి అప్పుడు ఎనిమిదో తరగతి చదివేది. మా స్కూల్లో తరగతులు ఐదు వరకే ఉన్నా తను మాత్రం ట్యూషన్లని చెప్పి వాలిపోయేది. అసలకే ఏకోపాధ్యాయ పాఠశాల, హైస్కూల్ నుండి ఒక ఫిగరు మా స్కూలుకి ట్యూషన్ కొసమని వచ్చేసరికి మా మాష్టారి కాన్సంట్రేషన్ అంతా ఈ రాణి మీదనే పడింది. చివరికి అది ఎంతదాక వచ్చిందంటే మాష్టారు మా అందరినీ వదిలేసి చివరికి ఆమె మీద వాలిపోవడం మొదలెట్టారు. ఈ అన్యాయాలని చూస్తూ భరించడం నాకు నా గ్యాంగ్ కి అస్సలు నచ్చలేదు. అప్పుడే మా గ్యాంగ్లో కొత్తగా చేరిన సత్తిగాడు, కిట్టుగాడితో కలిసి ఒక పథకరచన చేసాను.

 

అప్పుడు సాయంత్రం నాలుగు గంటలయింది, మాకు స్కూలు విడిచిపెట్టేసా(డు)రు. ఎప్పుడూ మా గ్యాంగ్కి స్కూల్ అయిపొయాక కూడా ఏవో పనులు చెప్పే మాస్టారు “రాణి” వచ్చాక మమ్మల్ని “కానీ”కి కూడా పనికిరానివాళ్ళలా చూడటం మొదలెట్టారు. ఈ ఘోరాన్ని భరించలేని మేము ఆ రోజు నేరుగా ఇంటికెల్లకుండా దారిలోని మామిడితోటలో కాపు కాసాం. ఐదయింది.. ఇంకా రాణీ స్కూల్ నుండి రాలేదు, ఇంతలో రోజుకి ఐదు సార్లు తినే గోపీగాడు ఆకలేస్తుందని గోల చేయడం మొదలెట్టాడు. అప్పుడే అటునుండి వెళ్తున్న పుల్ల ఐసు ఒకటి పావలా పెట్టి కొని వాడి నోరుకుట్టేసాను. ఐదున్నర అయింది.. ఇరవై రూపాయలు పెట్టి మా నాన్న గారు అమ్మవారి జాతరలో కొన్న వాచీ అలా ఉపయోగపడుతుందని ఎప్పుడూ అనుకోలేదు.

 

మరోసారి వాచీ చూసేలోపే ఎదురుగా రాణి రావటం కనిపించింది, మా గ్యాంగ్ అందరికీ చెవిలో ప్లాన్ మరోసారి చెప్పాను. రాణి దగ్గరకి రానే వచ్చింది, శీతాకాలం కావటంతో త్వరగానే చీకటి పడుతోంది. మేమందరమూ ప్లాన్ ప్రకారం ఒక్కొక్కరం ఒక్కో చెట్టు వెనకాల దాక్కున్నాం. మరోసారి సైగలతో మా గ్యాంగ్ అందరినీ అలర్ట్ చేసేసాను. సరిగ్గా రాణి మేమున్న చెట్ల మద్యలోకి రాగానే నేను గట్టిగా “మాస్టారు రాణిని లవ్ చేస్తున్నారు..మాస్టారు రాణిని లవ్ చేస్తున్నారు..మాస్టారు రాణిని లవ్ చేస్తున్నారు..మాస్టారు రాణిని లవ్ చేస్తున్నారు..” అని అరవటం మొదలెట్టాను, ఒక నాలుగైదు సార్లు అరిచాక అప్పుడు అర్దమైంది అక్కడ నేనొక్కడినే అరుస్తున్నానని.. మా గ్యాంగ్ అంతా నేను అరుస్తుంటే బ్రహ్మ చెముడు వచ్చిన వాళ్ళలాగ మామిడి చెట్ల వెనక నక్కి నిల్చున్నారు. చివరికి పట్టరానికోపంతో వాళ్ళమీద అరవటానికి మధ్యలోకి వచ్చేసరికి ఇంకేముంది.. రాణి నన్ను చూసి గుర్తుపట్టేసింది.

 

తరువాతిరోజు స్కూల్కి వెళ్ళాలా లేదా అని అలోచిస్తూ అమ్మతో రెండు తిట్లు తిట్టించుకొని మరీ స్కూల్ కి వచ్చాను. వచ్చేసరికే ప్రార్ధన కోసమని మా స్కూల్లో జనమంతా లైన్లో నిల్చుంటున్నారు. మాస్టారికి ఈ విషయం తెల్సిందో లేదో అని ఒకటే భయంతో వెళ్ళి నిల్చున్న కాసేపటికే ప్రార్ధన అయిపోయింది, బ్రతుకుజీవుడా అనుకుంటూ క్లాస్కి వెల్లబొతున్న నాకు “చందూ ఇటు రారా!” అని మాస్టారి పిలుపు వినపడింది. ఆ పిలుపుతో ఒక్కసారిగా గుండెల్లో రాయి.. ఏంటి మాస్టారు అని అడిగేలోపే “ఫట్ ఫట్” మంటూ మెరుపు వేగంతో నా చెంప ఛళ్ళుమంది(రెండుసార్లు)!

 

ఆ ఫట్ ఫట్లతో మళ్ళీ ప్రెజెంట్ కి వచ్చాను.

“అదేంటిరా నువ్ నన్ను లవ్ చేస్తున్నావ్గా, ఎందుకలా చెప్పావ్!?”

“ఏమోరా, అదంతా నేను చెప్పలేను వాళ్ళతో!”

“మీ పేరెంట్స్ నా గురించి అడిగారా!?”

“అడిగారు, ఫేస్ బుక్లో నీ ఫొటోస్ కూడా చూశారు”

“ఎమన్నారురా?”

“నువ్ పొట్టోడువిన్నారు”

“$%@$*@”

“ఆరడుగులుండి అమెరికాలో ఉంటేనే పెళ్ళి చేస్తారంట!”

“నా గురించి నువ్వేం చెప్పావ్రా మీ పేరెంట్స్ కి?”

“నువ్ మంచోడివని చెప్పా”

“నా గురించి చెప్పడానికి ఇంకేం లేదా? నేనంటే నా పేరు, నా రూపం ఒక్కటేనా? నాకంటూ ఇంకేం లేదా!”

“హైట్ లేదు”

 

ఇదీ ఒక జఫ్ఫా ప్రేమ కథ!

 

 

“ప్రేమంటే కథంతా కామెడీ ఉన్నా చివరికి ట్రాజడీగా ముగిసే ఒక డ్రామా!”

బాటసారి

ఇదొక బాటసారి కథ. పాకే బాలుడిగా, గుండెల్ని దోచే గడసరి చోరుడుగా, జన హృదయాల్ని గెలిచే ఒక వీరుడుగా మారిన ఒక సామాన్యుడి గాధ. ఆకలి, అవమానం, అపజయమే జీవితమైనా.. అన్యాయం అక్రమమే సమాజంగా చలామణి అవుతున్నా తలవంచక సాగే ఒక మనిషి కథ.

(త్వరలో తోలి భాగం)

నేను సైతం అని నువ్వంటే

నిన్ను సైతం మేము కూల్చేసాం

 

ఇంకానా అనుకుంటున్నావేమో

ఇంతేనా అని మేమంటున్నాం
మరో ప్రపంచమూహించావ్

ఈ ప్రపంచాన్నుంచి తరిమేసాం

 

హీనంగా దేన్ని చూడకంటే

విహీనంగా నిన్ను చేసాం

 

అజ్ఞానపుటంధ యుగంలో

నడిపిస్తే నడిచే మనుషులం

 

నిన్ను ఆంధ్రున్ని చేసి

పడగొట్టిన అమానుషులం

 

ఓ కవీ మమ్ము క్షమించు

నవకవనంతో మా కళ్ళు తెరిపించు

అంతా కలేనా!?

అంతా కలేనా!?
ఆ పలుకుల జడి
చెంపపై కన్నీటి తడి
అంతా కలే!!
అంతా ఊహేనా!?
మన పచ్చని లోగిలి
నీ వెచ్చని కౌగిలి
అంతా ఊహే!!
అంతా కథేనా!?
పాత మధురాలలోన
తీపి అధరాల జాణ
అంతా కథే!!

పరమ వీర —–

దాదాపు ఏడేళ్ళ క్రితం జరిగిన ఒక సంఘటన నేను జీవితాంతం మర్చిపోలేను. ఇంటర్ చదువుతున్నప్పుడు మాకు ఆదివారం వస్తే ఒక పండుగలా ఉండేది. ఎప్పుడెప్పుడు జగదాంబ సెంటర్ కి వెళ్తామా, ఎప్పుడు ఏదైనా హాల్ లో దూరి సినెమా చూస్తామా అని ఆ ఆరు రోజులూ తెగ ఎదురుచూసేవాళ్ళం. ఆదివారం వచ్చేసరికి ఇక మా ఆనందానికి హద్దులుండేవి కావు.

కానీ ఒకానొక ఆదివారం నా జీవితాన్ని మలుపు తిప్పిందనే చెప్పుకోవాలి. ఆ రోజు వీకెండ్ టెస్ట్ రాసి కాస్త ఆలస్యంగా జగదాంబ సెంటర్ కి చేరిన మాకు ఏ థియేటర్లోను టికెట్లు దొరక్క వెనుదిరుగుతుండగా మెలోడీ లో ఆడుతున్న ఒక సినిమా పోస్టర్ మీద మా చూపు పడింది. ఒక ప్రయత్నం చేస్తే పోలా అని మెలోడీ కి వెళ్ళి మా ఆరుగురం టికెట్స్ తీసుకున్నాం. దాదాపు అరగంట ఆలస్యంగా వెళ్ళినా టికెట్లు దొరకడంతో ఉబ్బితబ్బిబయి లోపలికి వెళ్ళి కూర్చున్నాం.

కూర్చున్నామో లేదో హీరో కాస్తా విలన్ ఇంటికి వెళ్ళి తనగురించి తను ఏదో చెప్తున్నాడు. ఒక ఐదు నిమిషాలు ఏమీ అర్థం కాక తలలు పట్టుకున్నాక హీరో చెప్పిన చివరి డైలాగ్ యస్ యస్ యస్ భవానీ ప్రసాద్ మాత్రం అర్థమైంది. పేరు చెప్పడానికి పది నిమిషాలు డైలాగ్ ఎందుకురా బాబు అనుకుంటుండగానే హీరొ గారు తొడ కొట్టడాలు, ట్రైన్లను ముందుకీ వెనక్కి తొడాగొట్టడంతో వచ్చిన పవర్ తో నడిపించడాలు, ఇంకా చాలా చిత్ర విచిత్రాలు జరిగిపొయాయి.

అసలు ఏం జరుగుతందో అర్థం కాక థియేటర్ లో జనమంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటుండగానే సినిమా శుభం కార్డ్ పడింది. బ్రతుకుజీవుడా అనుకుంటూ జనం సినిమాహాల్ నుండి బయటికిరావడం తొలిసారి చూసాను. అందరి ముఖాలలోనూ కొట్టొచ్చినట్లు కనిపించిన చావుకళని చూస్తే నాలానే అందరికీ చావు పరిచయమైందని అర్థమైంది. పలనాటి బ్రహ్మన్నాయుడు అనబడే ఆ సినిమాని నేను జీవితాంతం మర్చిపోలేను. బాలయ్య సినిమాలను జీవితంలో మరి చూడను అని నా మీద నేనే ఒట్టేసుకునేట్లు చేసిందా సినిమా..

ఇదంతా గతం. వర్తమానంలోకి వస్తే.. హైదరాబాద్,జనవరి 12వ తేదీ, సాయంత్రం 8.30 అయింది. అప్పుడే ఇంటికి వెళ్ళడానికి ట్రైన్ తప్పిపోయిందని నా స్నేహితుడి నుండి ఫోన్ వచ్చింది. సరే, ఏదైనా సినిమాకి వెళ్దామని అన్నా.. పరమవీరచక్ర చూద్దామని వాడు చెప్పాడు, అరెయ్ ఇంకేదైనా సినిమాకి వెళ్దాం రా అని బ్రతిమాలా.. వినలేదు. ప్రాధేయపడ్డా.. పట్టించుకోలేదు. ఎంతకీ నా మాట వినకపోయేసరికి, అరే మొదటిరోజు మనకి టికెట్లు దొరకవు లైట్ తీస్కోమన్నా! ఐనా సరే దొరుకుతాయి ముందు బుక్మైషో.కాం తెరిచి చూడమన్నాడు. తెరిచి చూస్తే 8.30 తర్వాత మొదలయ్యే అన్ని షోలకి, అన్ని హాళ్ళలోను టికెట్లు పుష్కలంగా ఉండటంతో తప్పక సినీమ్యాక్స్ లో రాత్రి 10:45 ఆటకి మూడు టికెట్లు తీసా.

మళ్ళీ దాదాపు ఏడేళ్ళ తర్వాత అదే సీను. హైటెక్ సిటికి వెళ్ళే దారిలో అండర్ బ్రిడ్జ్ దగ్గర ట్రాఫిక్ జాం కావడంతో అప్పటికే లేట్ గా బయల్దేరిన మాకు మరికాస్త ఆలస్యమై దాదాపు 30 నిమిషాల తర్వాత వెళ్ళాం. అప్పటికే ఆకలితో ఉన్న మాకు మూసేసిన KFC ని చూసి పీకలదాకా కోపం(మా మీద మాకే) వచ్చింది. చివరికి దొరికిన గడ్డిని తీసుకుని థియేటర్లో దూరాము. పక్కనున్న అమ్మాయిలని కూడా పట్టించుకోకుండా సినిమా మీదే concentration పెట్టాం.

బాలయ్య మాంచి ఊపు మీద ఉన్నాడు. లేబర్ నాయకుడిగా చెలరేగిపోతున్నాడు, బాలయ్య కి పోటీగా ఇనుప కాళ్ళ రోజా కూడా కుమ్మేస్తుంది. అప్పుడే బాలయ్యకి కథ చెప్పడానికి income Tax ఆఫీసర్(మీరు విన్నది నిజమే) ఒకడు వస్తాడు. బాలయ్యని ఫ్రీ గా సినిమా చేసి పెట్టమని అడుగుతాడు. బాలయ్య కథ నచ్చితే ఫ్రీగానే చేసేస్తానని చెబుతాడు. తర్వాత బాలయ్యకి కథ చెప్పడానికి కొంతమంది మిలటరీ ఆఫీసర్లు వస్తారు. అప్పుడు మరొక హింస మొదలవుతుంది, మేజర్ జయసింహ రూపంలో మరొక బాలయ్య ఎంటరవుతాడు.

మేజర్ జయసింహ గురించి ఆర్మీ ఆఫీసర్లు వర్ణించడంతో హీరో బాలయ్యకి జయసింహ పూనుతాడు. దానితో తను సెట్లో చెప్పాల్సిన డైలాగ్ మర్చిపోయి “నన్ను కొడితే చావాలి, నేను కొడితే చావాలి” అని జనాన్ని పదే పదే చావగొడతాడు. ఆగండాగండి.. ఇంకా కథ మొదలవలేదు. ఈ ఆర్మీ ఆఫీసర్లు ఆ చావాలి వరకే కథ చెప్పి మిగతా సగం చెబితే కుదరదని ప్రత్యక్షంగా చూడాల్సిందేనని చెప్పి బాలయ్యని హిమాలయాలకి తీసుకెళ్తారు. అక్కడ మన బొర్రా గుహల్లాంటి గుహల్లో జయసింహకి ట్రీట్మెంట్ ఇస్తా ఉంటారు(నాలుగేళ్ళూగా అలానే పడున్నా ఈ జయసింహకి కొంచెం కూడా గడ్డం పెరగదు, క్షమించండి LOGIC మాట్లాడినందుకు) ఇప్పటికి మొదటి సగం సినిమా పూర్తయింది. దీనితో అప్పటికే సగం కూడా నిండని థియేటర్ , ఉన్నవాళ్ళలో సగం మంది వెళ్ళిపోవటంతో ఇంకా ఖాళీ అయిపోయింది.

సినిమా రెండవ భాగంలో జయసింహని దేశద్రోహిగా చిత్రీకరించిన “హ్రుదయవిదారకమైన” కథని మన హీరో కి చెబుతారు. ఇక్కడ బలయ్య ఒక ఆంగ్ల డైలాగ్ ని భలే చెబుతాడు(something is going wrong sir అని బాలయ్య చెబుతుంటే ఈల వేయని ప్రేక్షకుడు లేడంటే నమ్మండీ). తర్వాత మేజర్ స్థానంలో మన హీరో గారు దూరుతారు. హీరొ గారి తక్షన కర్తవ్యం అతని ఇంఫార్మెర్ ని కలుసుకుని అతను ఇచ్చిన సమాచారాన్ని తీసుకోవటం. ఆ informer పాపం జయసిమ్హని తప్ప వేరే ఎవరిని గుర్తించలేడంటే మన బాలయ్య సై అని వెళ్తాడు. మన informer మాత్రం ముష్టివాడిలా ముసుగేసుకుని వచ్చి జయసింహ! జయసింహ! అని అరుస్తుంటాడు(అదే మరి variety అంటే). జయసింహ అప్పుడు కేక లాగ informer దగ్గరనుండి పెన్ డ్రైవ్ తీసుకుంటాడు. అందులో ఉన్న ఫొటోలను (దాశరి ఇక్కడ ఫొటోషాప్ ని భలే effectiveగా వాడుకున్నాడు )చూసేసరికి జయసింహకి విలన్ ఎవరో తెలిసిపోతుంది.

ఆ తర్వాత ఇంకా చెప్పాల్సింది ఏముంటుంది.. బాలయ్య చెలరేగిపోయి సింహం అని, నరసింహం అని ఏవేవో డైలాగులు కొట్టి జనాన్ని హింసిస్తాడు. మురళిమోహన్ కూడా తానేమీ తక్కువతినలేదన్నట్లు అడవిలో సింహం అని, జూలో సింహం అని చెప్పి ప్రేక్షకులకు పరీక్ష పెట్టి మరికొన్ని అధ్బుతమైన డైలాగ్లతో సినిమాను ముగిస్తారు.

సినిమా అంతా బాలయ్య ఎక్కడ కనిపించిన, డైలాగ్ చెప్పినా ఈలలు, చప్పట్లు, గోలలు.. సినిమా చూసి మూసుకుని కూర్చున్నది ఎవరైన ఉన్నారు అంటే అది ఒక్క బాలయ్య అభిమానులు మాత్రమే! ఎందుకో నాకు ఒక్క అభిమాని కూడా కనిపించలే..
సూచన: ఈ రివ్యూ చదివి సినిమా చూసినవారికీ,నాకు ఎటువంటి సంభంధం లేదు.

పీచు మిఠాయి-ప్రేమ కథ

నా తొలి ప్రేమ ఎంత ‘చిత్రమో’..! దానిని తొలి చూపు ప్రేమ అని కూడా అనొచ్చు. నా ఈ తొలి చూపు ప్రేమ లోని ‘చిత్ర ‘ విచిత్రాలు చదవండి మరి..
ఆ అమ్మాయిని ఎప్పుడు చూసానో తెలీదు కాని చూడగానే ప్రేమించేసాను. పెళ్ళంటూ చేసుకుంటే తననే చేసుకుంటానని నా తొలి చూపు లోనే decide అయిపోయా. ఆ ఇష్టం రోజు రోజుకి పిచ్చ పిచ్చగా  పెరిగి తనని చూసినప్పుడల్లా నాలో ఏదో తెలియని గుబులు రేపేది.
 
ఒక రోజు ధైర్యం చేసి అమ్మకి చెప్పేయాలని పిలిచాను. అమ్మ నీ కోడలిని చూపిస్తాను రా అంటే వచ్చింది.   “అమ్మ ఇదిగోనే నీ కోడలుఅంటూ కొంత దూరంలో ఉన్న తనని చూపించా.  అమ్మ చిన్నగా నవ్వుతూ వెళ్ళిపోయింది . అమ్మ నవ్వు వెనక ఉన్న అర్ధం ఏంటో తెలీక అమ్మ వెనకాలే వంట గదిలోకి వెళ్ళా..
 
“అమ్మా నీకు నచ్చిందా తనుఅని  అడిగేసాను .. 
 
“తనని ఇష్టపడని వెధవ ఎవడుంటాడురా బడుద్దాయి ” అంటూ మరోసారి నవ్వుతూ వెళ్ళిపోయింది
 
 అప్పుడు చూడాలి నా ఆనందం.. జల్సా సినిమా రిలీజ్ అవ్వని ఎన్నో ఏళ్లక్రితమే నా మనసు గాల్లో తేలినట్టుందే అంటూ ఒక పాట పాడేసింది. ఇక రోజు నుండి సినిమా చూస్తే తనే, దూరదర్శన్ చూస్తే తనే, పేపర్ చదివినా..  తనే.. , ఇలా ఎక్కడ చూస్తే అక్కడే ప్రత్యక్షమై తెగ తికమక పెట్టేది. పట్టుకున్దామనుకునే లోపే చటుక్కున మాయమైపోయేది .
 
ఇలా చాలా రోజులు గడిచాయి, నా ఒక వైపు ప్రేమ ఆర్య సినిమా తీయక ముందే మా ఫ్రెండ్స్ అందరిదగ్గరా పాపులర్ అయిపొయింది. అందరూ నన్నొక సినిమా హీరోలా చూస్తే మహా సంతోషం వేసేది.
 
కిట్టిగాడు, సత్తిగాడు,  గోపిగాడు ఇంకా మరొక ఇద్దరు ముగ్గురం కలిసి ఒక గ్యాంగ్. గ్యాంగ్ కి గ్యాంగ్ లీడర్ నేనే. మా గ్యాంగ్ లో నా మాటకి ఎదురుండేది కాదు. హీరోకి ఒక గ్యాంగ్ వుందంటే విలన్ కి కూడా మరొక గ్యాంగ్ వుండాలి కదా.. ఇక్కడ నాకూ ఒక ప్రత్యర్ధి గ్యాంగ్  వుండేది. ఆ గ్యాంగ్ కి జిత్తు గాడు లీడర్. పేరుకి తగ్గట్టే వాడోక జిత్తులమారి. 
 
ఒకసారి నా గ్యాంగ్లోని సత్తిగాడిని జిత్తు గాడు  వాడి గ్యాంగ్ లోకి చేర్పించుకున్నాడు.  ఆ దెబ్బతో మా గ్యాంగ్ లో నా పరువు పోయింది. ఎలా అయినా సత్తిగాడిని తిరిగి నా గ్యాంగ్ లోకి తీసుకొస్తే నా పోయిన పరువు తిరిగివస్తుందని ఒక అవకాశం కోసం ఎదురు చూస్తా ఉన్నాను. 
 
మరోసారి అమ్మాయి కనిపించగానే సారి అమ్మకి చెప్పేసాను.  “అమ్మా నేను ఆ అమ్మాయినే పెళ్ళి చేసుకుంటానే” అని అన్నా.. చేసుకుందువులేరా అంటూ అమ్మ మరోసారి నవ్వుతూ వెళ్ళిపోయింది. పక్కనే పేపర్ చదువుతున్న నాన్న కూడా ఈ సారి ఒక నవ్వు నవ్వి ఊరుకున్నారు. అమ్మ నవ్వులోని అర్ధమే తెలియక జుట్టు పీక్కుంటున్న నాకు నాన్న నవ్వు మరింత అయోమయానికి గురిచేసింది.   
 
ఏం చేయాలో తెలియక పక్కనే ఉన్న ఈనాడు పేపర్ తెరిచా..  తెరిచానో లేదో నాకు గుండె ఆగినంత పనయ్యింది. నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి పెళ్లి… రెండు రోజుల్లో.. ఇంతవరకు నాది ఒక వైపు ప్రేమే, ఇప్పుడైనా తనకి నా ప్రేమ విషయం చెప్పేయాలనుకున్నా.. లేదంటే తనని పెళ్లి చేసుకోబోయే వాడిని నా గ్యాంగ్ తో కొట్టించాలనుకున్నా..  
 
కానీ ఈ పేపర్ వాడు వాడి గురించిన ఏ సమాచారం ఇవ్వలేదాయే.. పోని నేను ప్రేమించిన అమ్మాయికి నా ప్రేమ విషయం చెప్దామనుకున్నా , కానీ తన దగ్గరికి వెళ్ళి నా ప్రేమ విషయం చెప్పాలంటే నా దగ్గర అంత డబ్బు లేదాయె.. 
 
మా గ్యాంగ్ లోని సత్తిగాడి దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటాయి కాని వాడు ఇప్పుడు నా గ్యాంగ్ కాదు. సత్తిగాడికున్న ఒకే ఒక weaknessని ఆ జిత్తు గాడు cash చేసుకున్నాడు. ఇక తప్పక అమ్మ దగ్గరికి వెళ్ళాను, అమ్మా నాకు డబ్బులు కావాలని అడిగా..
 
“ఎందుకురా” అని అడిగింది అమ్మ,
 
“అక్కడ నీ కోడలికి పెళ్ళమ్మా” అన్నాను,
 
ఎంతైనా తల్లి మనసు కదా! నాకన్నా ఎక్కువే  బాధపడుతుందని ఊహించి అమ్మ ముఖాన్ని చూసాను, మళ్ళీ అదే నవ్వు, ఈ సారి మాత్రం నా బాధ, కోపం కలిసి అమ్మని “నువ్వింత సాడిస్టువి అనుకోలేదు” అని చెడా మడా తిట్టేద్దామనుకున్నా..
 
ఇలా అనుకునేలోపే అమ్మ నా చేతిలో డబ్బు తీసుకొచ్చి పెట్టింది.  చూస్తే రెండు రూపాయిల బిళ్ళ.
 
దీనితో ఏం  చేసుకోవాలమ్మా ” అని కోపంగా అడిగా..
 
పోయి పీచు మిఠాయి కొనుక్కో” అంది అమ్మ
 
 ఇక చేసేదేమీలేక నా దగ్గరున్న అర్ధ రూపాయి తో కలిపి రెండున్నరపెట్టి ఎప్పుడోగాని ఊరిలోకిరాని పీచు మిఠాయి కొనుక్కున్నా..
 
ఇలా పీచుమిఠాయి కొనుక్కొని, తినకుండా, వాకిట్లోని అరుగు మీద కూర్చొని నేను కోల్పోయిన నా ప్రేమని తలుచుకుంటూ బాధపడతా ఉన్నాను. అప్పుడే సత్తిగాడు మా ఇంటి ముందునుండి అలా వెళ్తున్నాడు.
 
అప్పుడే నాకు సత్తిగాడి పీచు మిఠాయి weakness గుర్తొచ్చింది. నేను ఇవ్వనన్న పీచు మిఠాయిని ఆ జిత్తుగాడు ఇచ్చి సత్తిగాడిని వాడి గ్యాంగ్ లో కలిపేసుకున్నాడు. వెంటనే నాకు !dea వచ్చింది. సత్తిగాడిని పిలిచి ఆ మిఠాయిని వాడికి ఇచ్చేసా.. వాడు ఎగిరి గంతేస్తూ ఆ మిఠాయిని తీసుకున్నాడు, పనిలో పనిగా నా గ్యాంగ్ లో చేరమని షరతు కూడా పెట్టేసా.
 
సత్తిగాడు పీచుమిఠాయి తినేసాక నేను డబ్బులు అడుగుదామనుకున్నా. ఆ మిఠాయికి పొట్లాం కట్టిన కాగితంలో ఏదో తెలిసిన ముఖం ఉన్నట్లుందని విప్పి చూసా. అది నేను ప్రేమించిన అమ్మాయి పెళ్ళికి సంభందించిన వార్త..
 
” సినీ నటి శ్రీదేవి నిర్మాత బోనీ కపూర్ ని పెళ్ళి చేసుకోనుంది” అంటూ ఇద్దరి ఫొటోలు పక్క పక్కన ఇచ్చారు.
 
అది చూసి నా ప్రేమ విఫలమయిందనే బాధ నా నుండి ఒక్కసారి దూరమైపోయింది. నన్ను వదిలేసి ఒక ముసలివాడిని పెళ్ళి చేసుకుంటుందా, తనకి అంత అదృష్టం లేదనుకుంటా పాపం అని జాలి పడి, సత్తి గాడిని మళ్ళి నా గ్యాంగ్ లో చేర్పించిన ఆ పీచు మిఠాయికి మనసులో thanks చెప్పుకుంటూ జిత్తు గాడికి వార్నింగ్ ఇవ్వడానికి నా గ్యాంగ్ ని వేసుకుని వెళ్ళిపోయా..
(ఇదంతా చదివాక అప్పటికి నా వయసు ఎంతని అడగాలనుకుంటున్నారా? just 9 years అండి) 

ఊహలలోకంలో

ఊహలలోకం లోని కలలు, చెదరిన మైకంలోని కథలు

కలం నుండి జారిపడి కాగితం కోసం చూస్తుంటే..

ఈ ‘ అంతర్జాలము ‘ నా అంతరంగాన్ని కనిపెట్టేసింది..

నన్ను కట్టుకోమంటూ నాలుగు మొట్టికాయలు వేసింది..

నేనూరుకుంటానా దాన్ని ఒక టపాతో కట్టిపడేసాను.

Follow

Get every new post delivered to your Inbox.