Feeds:
టపాలు
వ్యాఖ్యలు

‘కథ’ అనే వర్గంలోని టపాలు



Image
కేరళ వచ్చి రెండు రోజులైంది. కొత్త ఆలోచనలకోసం ఇక్కడికి వచ్చిన నాకు నిరాశే ఎదురవుతూ వస్తోంది. ఈ అందమైన ప్రకృతి నన్ను పులకింపజేస్తుందే గాని నాలో కొత్త ఆలోచనలు రేకిత్తంచట్లేదు. కొత్త భావాలు, ఆలోచనలు కొత్త పరిచయాలతోనే కలుగుతాయి తప్ప కొత్త ప్రదేశాలతో కాదు అని అర్దమయింది. అలాంటి పరిచయం కోసం ఎదురు చూస్తుండగానే మేమంతా అల్లెపీకి బయల్దేరాం!ఎర్నాకులం నుండి అల్లెపీకి ట్రైన్లో గంటన్నర ప్రయాణం. ప్రొద్దున్నే మేముండే హోటల్ నుండి బయల్దేరి ఎర్నాకులం టౌన్ స్టేషన్‌కి చేరుకున్నాం. అల్లెపీ చాలా అందమైన ప్రదేశమని ఎంతో మంది చెప్పాగా విన్నాను.

ట్రైన్ ఎర్నాకులం జంక్షన్‌కి చేరుకుంది. నాతో పాటు ఉన్న స్నేహితులిద్దరు అప్పటికే నిద్రపోయారు. ట్రైన్లోకి పాల క్యాన్లు ఎక్కిస్తున్నారు కూలీలు, వాళ్ళ జీవితాలు ఎంత నెమ్మదిగా ఉన్నాయో అంతే నెమ్మదిగా లోడ్ ఎక్కిస్తున్నట్లుగా అనిపించింది. నా ఎదురుగా కూర్చున్న ముసలాయన ముఖంలో ముడతలు అతను గడించిన అనుభవాన్ని ఇట్టే చెప్తున్నాయి. ట్రైన్ కూత పెట్టి కదిలిందో లేదో ఒకమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి మేమున్న బోగీలోకి ఎక్కి, సరాసరి నా ఎదురుగా ముసలాయన పక్కగా విండో సీట్లో కూర్చొంది.

మలయ మారుతంలా వచ్చి చేరిన ఆమెని చూసేసరికి ఇన్నాళ్ళ నైరాశ్యం ఒక్కసారిగా పోయింది. ఆ ముఖారవిందానికి చంద్రుడైనా చిన్నబొవాలి, ఆ కురుల విరులు చూసినవారెవరైనా కవి కావల్సిందే..! కోటి భావాలు ఒక్క క్షణంలో పలికించగల కళ్ళు , సంధ్యాసమయపు ఎరుపుని పూసుకున్న ఆ అధరాలు.. అసలు వర్ణనకే అందని ఆ వంపులు.. ఏ దేవకన్యనో దారితప్పి ఇలా చేరిందా అని ఆశ్చర్యంతో, ఒకరకపు అనుభూతితో ఆమె వైపు కళ్ళార్పనియ్యకుండా చేస్తున్నాయి!

చూస్తూ చూస్తూ నన్నే మరచిన సమయంలో ఆమె ఒక్కసరిగా నా వైపు తిరిగింది.అందరు మలయాళి అమ్మాయిలలా పక్క పాపిడి లేదు, అడ్డ బొట్టు మాత్రం ఉంది. తేట తెలుగుదనం ఉట్టిపడేట్లు ముక్కు పుడక కూడా ఉంది. ఆమె ముఖంలో ఎక్కడో పరిచయమున్న వ్యక్తిని చూసిన భావన! తదేకంగా నన్నే చూస్తూ ఉన్న ఆమెని ఉండబట్టలేక అడిగేసా “మీరు తెలుగు అమ్మాయా!?” అని. ఒక్కసారిగా ఉలిక్కిపడిన ఆమె, కొన్ని సెకెన్లు ఆగి “అవును” అనే సమాధానం ఇచ్చింది. ఎంత అదృష్టవంతుడిని నేను.. ఐదు కోట్ల కేరళ లాటరీ తగిలినట్లు.. మలబార్ హొటల్‌లో జీవితాంతం ఫ్రీగా కాఫీ తాగే ఆఫర్ వచ్చినట్లు, అన్నీ అర్దమయ్యి ఏమీ అర్దం కానట్లు ఏదో ఒక అనిర్వచనీయమైన అనుభూతిలో ఉండగానే “I’m Kriti, మరి మీరు?” అని అడిగింది.

“I’m Chandu, మనం ఇదివరకేమైనా కలిశామా!?” అన్న వాక్య పూర్తి కాకముందే ఆమె ముఖంలో రంగులు మారడం కనిపించింది. ప్రశాంతంగా కనిపించిన ఆ కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరగడం కూడా చూశాను. నేనేమైనా తప్పుగా అడిగానా! ఆమె ఎందుకలా స్పందించిందో అర్దం కాలేదు. నేను ఆమెని అడిగేలోపే “Sorry, మీ పేరు వినేసరికి నాకు ఇంతకుముందు చదివిన కథ ఒకటి జ్ఞాపకమొచ్చింది” అంది.

“ఓహ్! నాకు ఆ కథ చెప్పగలరా..”

“లేదండీ.. నాకు సరిగా గుర్తులేదు, చెప్పలేను కూడా!”

“ప్లీజ్ కృతి, నేను బ్లాగు రాస్తా ఉంటాను, గత సంవత్సరంన్నర నుండి కొత్తగా వ్రాయలేక, ఏం చేయాలో తెలియక సినిమాలగురించి రాసుకుంటున్నాను” అంటూ నాకు చేతనయినంత బ్రతిమాలాను.

“సరే.. చెప్తాను, మీరు అడుగుతున్నారని కాదు. నాకు చెప్పాలనిపించి చెప్తున్నాను. ఈ కథని కథగా మాత్రమే తీసుకోండి” అంటూ చెప్పడం start చేసింది.

* * * * * *
రవి, సుధీర్ ఇద్దరూ రూంమేట్స్. రవి కథలు, కవితలు రాస్తుంటాడు. ఒక రోజు రాత్రంతా రవి ఏదో రాస్తూ కూర్చున్నాడు. ప్రొద్దున్నే లేచిన సుధీర్ డైరీ ముందేసుకుని ఎదో రాస్తున్న రవివైపు చూసి “ఏరా.. కొత్త కథా?” అని అడిగాడు. రవి ఔనన్నట్లు తల ఊపి పెన్ను డైరీ మీద పెట్టి లేచి పక్కకి వెళ్ళిపోతాడు. సుధీర్ ఆ కథ చదవడం మొడలెడతాడు.

****

ఆ: “నేనంటే నీకు ఎంతిష్టం?”

అ: “ఎంత, ఎందుకు అన్నవి ప్రేమకి parameters కాదురా.. కాకూడదు కూడా! సరే, నువ్ అడుగుతున్నావని చెప్తున్నా! నీతో కలిసి బ్రతకాలన్నంత.. నీ తోడు లేకుంటే బ్రతకలేనంత”

ఆ: “ఎందుకంత భరువైన డైలాగ్? అయినా..నువ్ సినిమాలలో try చేయి చందు.. మంచి writerగా సెటిల్ అవుతావ్!”

అ: “నీ ప్రేమ నన్నంత గొప్ప writerగా మలిస్తే తప్పకుండా ప్రయత్నిస్తా! నీ ప్రేమ కలిగించే భావావేశం, నీ స్పర్శ కలిగించే తన్మయత్వం నాకు జీవితాంతం కావలిరా”

ఆ: “I don’t know how special I’am, but you are making me to feel special. I love you so much ra!”

****
“ఏరా.. నీ కథే ఇన్స్పిరేషనా ఈ కథకి” సుధీర్ అడిగాడు. రవి ఏదో ధీర్ఘాలోచనలో మునిగిపోయి ఏమీ మాట్లాడలేదు. సుధీర్ మళ్ళీ కథలో పడిపోయాడు. కథలో ఒక సంవత్సరం గడిచింది.
****
ఆ: “ఇంకా ఎన్ని రోజులిలా?”

అ: “ఇప్పుడేమయిందిరా!”

ఆ: “ఏమీ కాలేదు చందు, కానీ ఎన్ని రోజులిలా..!? నేను నీకన్నా రెండేళ్ళు చిన్న, మన పరిచయం ప్రేమగా మారి రెండేళ్ళు కావస్తోంది. నువ్ చెప్పిన ఆ రెండేళ్ళు అయిపోయాయ్ చందూ..”

అ: “ఇప్పుడు నన్నేం చేయమంటావ్రా?”

ఆ: “రాజకీయాలన్నావ్, writerగా సెటిల్ అవుతా అన్నావ్.. బిజినెస్ అన్నావ్.. చివరికి ఒక బేవర్స్ లా ఇలా ఖాళీగా ఉన్నావ్! నీ ఆదర్శాలు గొప్పవే చందు.. కానీ ఈ సమాజం నీకు అన్నం పెట్టదు, నిన్ను చేసుకుని నన్ను కూడా పస్తులుండమంటావా”

****
మరో రెండు నెలలు గడిచింది.
****

ఆ: “నన్ను మర్చిపో చందు.. ఇక నావల్ల కాదు!”

అ: “—————————————–”

ఆ: “ఇంకా కష్టం చందు, రెండేళ్ళుగా చూస్తున్నాను, అది చేస్తా ఇది చేస్తా అంటున్నావేగాని ఎందులోనూ నిలకడ లేదు. ఉద్యోగంలో చేరావ్, రెండు నెలలు కూడా చేయలేదు. reporterగా join అయ్యావ్, కనీసం రెండు వారాలు కూడా ఉండలేకపోయావ్. రాజకీయాలన్నావ్.. చివరికి ఉద్యమాలు కూడా corrupt అయ్యాయని వెనక్కి వచ్చేసావ్!!”

అ: “డబ్బుకోసమో, పదవికోసమో రాజీ పడుతూ బ్రతకలేం కదరా!”

ఆ: “నాకోసం కూడా రాజీ పడవా??”

అ: “ఒకప్పుడు నాలో ఏమి చూసైతే నన్ను ప్రేమించావో వాటినే వదులుకోమంటున్నవా! ఉద్యమాల్లో పాల్గొంటే అభినందించావ్.. కవితలు చదివి అభిమాని అయ్యానన్నావ్.. కథలు, వ్యాసాలు చదివి కరిగిపోయానన్నావ్! ఇప్పుడు ఆ అభిమానం, ప్రేమ ఏమైపోయాయిరా!?”

ఆ: “ఈ కథలు, కవితలూ అన్నీ పిచ్చి రాతలు చందూ.. కాలేజ్ క్యాంటీన్లో బాతాఖానికి పనికొస్తాయి. అవి నిన్ను ఆనందపెడతాయేమోగాని, అన్నం మాత్రం పెట్టవు!”

అ: “ఎన్ని జన్మలైనా నాతోనే ఉంటానన్నావ్!”

ఆ: “నువ్ ఈ జన్మలో మారవని అర్థమయ్యాక కూడా నీతోనే ఉండమంటావా??”
****
తనతో కలిసి బ్రతకాలన్నంత, తన తోడు లేకుంటే బ్రతకలేనంత ఇష్టం పెంచుకున్న చందు.. తన కథకి, కవితకి ప్రేరణైన ప్రేయసిని కోల్పోయి మనసు చిద్రమై ఉరిపోసుకుని చనిపోతాడు.

“కథకి ending ఏంటిరా ఇలా ఇచ్చావ్!” అంటూ సుధీర్ రవి కోసం తిరగంగానే పక్క గది కిటికీలోనుండి రవి ఫ్యాన్‌కి వేలాడుతూ కనిపిస్తాడు! తలుపు తీసి రూంలోకి వెళ్ళంగానే ఒక కాగితం ఎగురుకుంటా వచ్చి సుధీర్ ముఖం మీద పడుతుంది. “I am Chandu” అని ఉంటుంది ఆ కాగితంలో!
* * * * * * *

ఇంతకాలం కథలో లీనమై వింటున్న నాకు అదొక పెద్ద షాక్! ఇంతకీ ఇది కథా, నిజమా.. ఇంత అద్భుతంగా ఆమె కథ చెప్పగలిగిందంటే ఆమె గొప్ప రచయిత్రయినా కావాలి లేక ఆమె జీవితంలో ఈ సంఘటన జరిగైనా ఉండాలి. ఆమె కళ్ళలో నీళ్ళు సుడులు తిరుగుతూనే ఉన్నాయి. ఇంతలో ట్రైన్ అల్లెపీ చేరుకుంది.

“చెప్పండి కృతి, ఇది నిజంగా కథేనా!?” అడిగాన్నేను. కానీ ఆమె నుండి ఎటువంటి స్పందనా లేదు, అదే సుడులు తిరిగిన కళ్ళతో కిటికీ లోనుండి బయటకు చూస్తూ ఉంది.

“ఈ కథలో ఉన్న అమ్మాయి మీరే కదా!” చెప్పకనే అవునని చెబుతున్నాయి ఆ కళ్ళు. చందుని ఎంత మిస్సవుతుందో, ఆమె ప్రేమలో ఎంత నిజాయితీ ఉందో ఆ క్షణం అర్దమయింది.

“మరెందుకు ఆ క్షణం విడిపోయారు?” నేను అడుగుతున్నా పట్టించుకోకుండా ట్రైన్ దిగి వెళ్ళిపోతుంది.

“Please ఏమయిందో చెప్పండి!” అంటూ వెంటబడ్డాను.. స్టేషన్ బయటికెళ్ళి ఏమీ చెప్పకుండానే ఆమె ఆటో ఎక్కి వెళ్ళిపోయింది.

ఆ రోజంతా అల్లెపీలో ఎక్కడకి వెళ్ళినా కృతి గురించే ఆలోచిస్తున్నా! అల్లెపీ బీచ్‌లొ శిథిల పడ్డ ఇనుప వారధిలా ఆమె ప్రేమ శిథిలమై గమ్యం చేరకుండానే కూలిపోయినట్లు అనిపించింది. బ్యాక్‌వాటర్స్ లో అక్కడక్కడా మిగిలిన దీవుల్లాగా ఆమెలో ప్రేమ జ్ఞాపకాలు ఇంకా మిగిలి బాధిస్తున్నట్లు అనిపించింది. ఎంత గొప్ప ప్రేమ ఆమెది? చందు చనిపోయి ఈమెని జీవచ్చవం చేసాడేమో కదా!

Read Full Post »


“ఏంటిరా అలా ఉన్నావ్!? ఏమైంది?”

“మన విషయం ఇంట్లో తెల్సిపోయిందిరా :(

“అవునా, అదెలా రా? ఏమైంది అసలు??”

“ఏమో రా, ఎలా తెల్సిందో! మా మమ్మీ నీ గురించి అడిగింది”

“ఏం చెప్పావ్రా మరి?”

“నీకు నేనంటే ఇష్టమని చెప్పా!”

“ఓహ్! గుడ్ రా! ఎప్పటికైనా చెప్పాల్సిందేగా! :D ఇంతకీ ఆమె ఎమన్నారు?”

“మరి నీకు ఇష్టమా కాదా అని అడిగారురా!”

“మరి నువ్వేమన్నావ్!?”

“ఒక ఫ్రెండ్లా ఇష్టమని చెప్పా!”

తుస్..

.

.

.

.

.

మళ్ళీ బకరా అయిపోయాను. చిన్నప్పుడెప్పుడో అంత ఘాఢంగా ప్రేమించిన శ్రీదేవి దక్కకపోయేసరికి మళ్ళీ నాలుగో తరగతిదాక ఏ అమ్మాయిని కన్నెత్తి కూడా చూడలేదు. దానితో నా చదువు భలే సాఫీగా సాగుతూ క్లాస్ ఫష్టు కూడా తెచ్చుకున్నాను. మా మాస్టారు కూడా బడి ఎగ్గొట్టడానికి నేనెన్ని కుంటి సాకులు చెప్పినా నమ్మేంత “నమ్మకం” కల్పించుకున్నాను!

 

సరిగ్గా అప్పుడే రామాయణంలో మాయ లేడిలా ఒక “లేడీ” మా స్కూల్లో అడుగుపెట్టింది. ఆ అమ్మాయి పేరు రాణి(పేరు మార్చానులెండి :p),ఆ రాణి అప్పుడు ఎనిమిదో తరగతి చదివేది. మా స్కూల్లో తరగతులు ఐదు వరకే ఉన్నా తను మాత్రం ట్యూషన్లని చెప్పి వాలిపోయేది. అసలకే ఏకోపాధ్యాయ పాఠశాల, హైస్కూల్ నుండి ఒక ఫిగరు మా స్కూలుకి ట్యూషన్ కొసమని వచ్చేసరికి మా మాష్టారి కాన్సంట్రేషన్ అంతా ఈ రాణి మీదనే పడింది. చివరికి అది ఎంతదాక వచ్చిందంటే మాష్టారు మా అందరినీ వదిలేసి చివరికి ఆమె మీద వాలిపోవడం మొదలెట్టారు. ఈ అన్యాయాలని చూస్తూ భరించడం నాకు నా గ్యాంగ్ కి అస్సలు నచ్చలేదు. అప్పుడే మా గ్యాంగ్లో కొత్తగా చేరిన సత్తిగాడు, కిట్టుగాడితో కలిసి ఒక పథకరచన చేసాను.

 

అప్పుడు సాయంత్రం నాలుగు గంటలయింది, మాకు స్కూలు విడిచిపెట్టేసా(డు)రు. ఎప్పుడూ మా గ్యాంగ్కి స్కూల్ అయిపొయాక కూడా ఏవో పనులు చెప్పే మాస్టారు “రాణి” వచ్చాక మమ్మల్ని “కానీ”కి కూడా పనికిరానివాళ్ళలా చూడటం మొదలెట్టారు. ఈ ఘోరాన్ని భరించలేని మేము ఆ రోజు నేరుగా ఇంటికెల్లకుండా దారిలోని మామిడితోటలో కాపు కాసాం. ఐదయింది.. ఇంకా రాణీ స్కూల్ నుండి రాలేదు, ఇంతలో రోజుకి ఐదు సార్లు తినే గోపీగాడు ఆకలేస్తుందని గోల చేయడం మొదలెట్టాడు. అప్పుడే అటునుండి వెళ్తున్న పుల్ల ఐసు ఒకటి పావలా పెట్టి కొని వాడి నోరుకుట్టేసాను. ఐదున్నర అయింది.. ఇరవై రూపాయలు పెట్టి మా నాన్న గారు అమ్మవారి జాతరలో కొన్న వాచీ అలా ఉపయోగపడుతుందని ఎప్పుడూ అనుకోలేదు.

 

మరోసారి వాచీ చూసేలోపే ఎదురుగా రాణి రావటం కనిపించింది, మా గ్యాంగ్ అందరికీ చెవిలో ప్లాన్ మరోసారి చెప్పాను. రాణి దగ్గరకి రానే వచ్చింది, శీతాకాలం కావటంతో త్వరగానే చీకటి పడుతోంది. మేమందరమూ ప్లాన్ ప్రకారం ఒక్కొక్కరం ఒక్కో చెట్టు వెనకాల దాక్కున్నాం. మరోసారి సైగలతో మా గ్యాంగ్ అందరినీ అలర్ట్ చేసేసాను. సరిగ్గా రాణి మేమున్న చెట్ల మద్యలోకి రాగానే నేను గట్టిగా “మాస్టారు రాణిని లవ్ చేస్తున్నారు..మాస్టారు రాణిని లవ్ చేస్తున్నారు..మాస్టారు రాణిని లవ్ చేస్తున్నారు..మాస్టారు రాణిని లవ్ చేస్తున్నారు..” అని అరవటం మొదలెట్టాను, ఒక నాలుగైదు సార్లు అరిచాక అప్పుడు అర్దమైంది అక్కడ నేనొక్కడినే అరుస్తున్నానని.. మా గ్యాంగ్ అంతా నేను అరుస్తుంటే బ్రహ్మ చెముడు వచ్చిన వాళ్ళలాగ మామిడి చెట్ల వెనక నక్కి నిల్చున్నారు. చివరికి పట్టరానికోపంతో వాళ్ళమీద అరవటానికి మధ్యలోకి వచ్చేసరికి ఇంకేముంది.. రాణి నన్ను చూసి గుర్తుపట్టేసింది.

 

తరువాతిరోజు స్కూల్కి వెళ్ళాలా లేదా అని అలోచిస్తూ అమ్మతో రెండు తిట్లు తిట్టించుకొని మరీ స్కూల్ కి వచ్చాను. వచ్చేసరికే ప్రార్ధన కోసమని మా స్కూల్లో జనమంతా లైన్లో నిల్చుంటున్నారు. మాస్టారికి ఈ విషయం తెల్సిందో లేదో అని ఒకటే భయంతో వెళ్ళి నిల్చున్న కాసేపటికే ప్రార్ధన అయిపోయింది, బ్రతుకుజీవుడా అనుకుంటూ క్లాస్కి వెల్లబొతున్న నాకు “చందూ ఇటు రారా!” అని మాస్టారి పిలుపు వినపడింది. ఆ పిలుపుతో ఒక్కసారిగా గుండెల్లో రాయి.. ఏంటి మాస్టారు అని అడిగేలోపే “ఫట్ ఫట్” మంటూ మెరుపు వేగంతో నా చెంప ఛళ్ళుమంది(రెండుసార్లు)!

 

ఆ ఫట్ ఫట్లతో మళ్ళీ ప్రెజెంట్ కి వచ్చాను.

“అదేంటిరా నువ్ నన్ను లవ్ చేస్తున్నావ్గా, ఎందుకలా చెప్పావ్!?”

“ఏమోరా, అదంతా నేను చెప్పలేను వాళ్ళతో!”

“మీ పేరెంట్స్ నా గురించి అడిగారా!?”

“అడిగారు, ఫేస్ బుక్లో నీ ఫొటోస్ కూడా చూశారు”

“ఎమన్నారురా?”

“నువ్ పొట్టోడువిన్నారు”

“$%@$*@”

“ఆరడుగులుండి అమెరికాలో ఉంటేనే పెళ్ళి చేస్తారంట!”

“నా గురించి నువ్వేం చెప్పావ్రా మీ పేరెంట్స్ కి?”

“నువ్ మంచోడివని చెప్పా”

“నా గురించి చెప్పడానికి ఇంకేం లేదా? నేనంటే నా పేరు, నా రూపం ఒక్కటేనా? నాకంటూ ఇంకేం లేదా!”

“హైట్ లేదు”

 

ఇదీ ఒక జఫ్ఫా ప్రేమ కథ!

 

 

“ప్రేమంటే కథంతా కామెడీ ఉన్నా చివరికి ట్రాజడీగా ముగిసే ఒక డ్రామా!”

Read Full Post »


నా తొలి ప్రేమ ఎంత ‘చిత్రమో’..! దానిని తొలి చూపు ప్రేమ అని కూడా అనొచ్చు. నా ఈ తొలి చూపు ప్రేమ లోని ‘చిత్ర ‘ విచిత్రాలు చదవండి మరి..
ఆ అమ్మాయిని ఎప్పుడు చూసానో తెలీదు కాని చూడగానే ప్రేమించేసాను. పెళ్ళంటూ చేసుకుంటే తననే చేసుకుంటానని నా తొలి చూపు లోనే decide అయిపోయా. ఆ ఇష్టం రోజు రోజుకి పిచ్చ పిచ్చగా  పెరిగి తనని చూసినప్పుడల్లా నాలో ఏదో తెలియని గుబులు రేపేది.
 
ఒక రోజు ధైర్యం చేసి అమ్మకి చెప్పేయాలని పిలిచాను. అమ్మ నీ కోడలిని చూపిస్తాను రా అంటే వచ్చింది.   “అమ్మ ఇదిగోనే నీ కోడలుఅంటూ కొంత దూరంలో ఉన్న తనని చూపించా.  అమ్మ చిన్నగా నవ్వుతూ వెళ్ళిపోయింది . అమ్మ నవ్వు వెనక ఉన్న అర్ధం ఏంటో తెలీక అమ్మ వెనకాలే వంట గదిలోకి వెళ్ళా..
 
“అమ్మా నీకు నచ్చిందా తనుఅని  అడిగేసాను .. 
 
“తనని ఇష్టపడని వెధవ ఎవడుంటాడురా బడుద్దాయి ” అంటూ మరోసారి నవ్వుతూ వెళ్ళిపోయింది
 
 అప్పుడు చూడాలి నా ఆనందం.. జల్సా సినిమా రిలీజ్ అవ్వని ఎన్నో ఏళ్లక్రితమే నా మనసు గాల్లో తేలినట్టుందే అంటూ ఒక పాట పాడేసింది. ఇక రోజు నుండి సినిమా చూస్తే తనే, దూరదర్శన్ చూస్తే తనే, పేపర్ చదివినా..  తనే.. , ఇలా ఎక్కడ చూస్తే అక్కడే ప్రత్యక్షమై తెగ తికమక పెట్టేది. పట్టుకున్దామనుకునే లోపే చటుక్కున మాయమైపోయేది .
 
ఇలా చాలా రోజులు గడిచాయి, నా ఒక వైపు ప్రేమ ఆర్య సినిమా తీయక ముందే మా ఫ్రెండ్స్ అందరిదగ్గరా పాపులర్ అయిపొయింది. అందరూ నన్నొక సినిమా హీరోలా చూస్తే మహా సంతోషం వేసేది.
 
కిట్టిగాడు, సత్తిగాడు,  గోపిగాడు ఇంకా మరొక ఇద్దరు ముగ్గురం కలిసి ఒక గ్యాంగ్. గ్యాంగ్ కి గ్యాంగ్ లీడర్ నేనే. మా గ్యాంగ్ లో నా మాటకి ఎదురుండేది కాదు. హీరోకి ఒక గ్యాంగ్ వుందంటే విలన్ కి కూడా మరొక గ్యాంగ్ వుండాలి కదా.. ఇక్కడ నాకూ ఒక ప్రత్యర్ధి గ్యాంగ్  వుండేది. ఆ గ్యాంగ్ కి జిత్తు గాడు లీడర్. పేరుకి తగ్గట్టే వాడోక జిత్తులమారి. 
 
ఒకసారి నా గ్యాంగ్లోని సత్తిగాడిని జిత్తు గాడు  వాడి గ్యాంగ్ లోకి చేర్పించుకున్నాడు.  ఆ దెబ్బతో మా గ్యాంగ్ లో నా పరువు పోయింది. ఎలా అయినా సత్తిగాడిని తిరిగి నా గ్యాంగ్ లోకి తీసుకొస్తే నా పోయిన పరువు తిరిగివస్తుందని ఒక అవకాశం కోసం ఎదురు చూస్తా ఉన్నాను. 
 
మరోసారి అమ్మాయి కనిపించగానే సారి అమ్మకి చెప్పేసాను.  “అమ్మా నేను ఆ అమ్మాయినే పెళ్ళి చేసుకుంటానే” అని అన్నా.. చేసుకుందువులేరా అంటూ అమ్మ మరోసారి నవ్వుతూ వెళ్ళిపోయింది. పక్కనే పేపర్ చదువుతున్న నాన్న కూడా ఈ సారి ఒక నవ్వు నవ్వి ఊరుకున్నారు. అమ్మ నవ్వులోని అర్ధమే తెలియక జుట్టు పీక్కుంటున్న నాకు నాన్న నవ్వు మరింత అయోమయానికి గురిచేసింది.   
 
ఏం చేయాలో తెలియక పక్కనే ఉన్న ఈనాడు పేపర్ తెరిచా..  తెరిచానో లేదో నాకు గుండె ఆగినంత పనయ్యింది. నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి పెళ్లి… రెండు రోజుల్లో.. ఇంతవరకు నాది ఒక వైపు ప్రేమే, ఇప్పుడైనా తనకి నా ప్రేమ విషయం చెప్పేయాలనుకున్నా.. లేదంటే తనని పెళ్లి చేసుకోబోయే వాడిని నా గ్యాంగ్ తో కొట్టించాలనుకున్నా..  
 
కానీ ఈ పేపర్ వాడు వాడి గురించిన ఏ సమాచారం ఇవ్వలేదాయే.. పోని నేను ప్రేమించిన అమ్మాయికి నా ప్రేమ విషయం చెప్దామనుకున్నా , కానీ తన దగ్గరికి వెళ్ళి నా ప్రేమ విషయం చెప్పాలంటే నా దగ్గర అంత డబ్బు లేదాయె.. 
 
మా గ్యాంగ్ లోని సత్తిగాడి దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటాయి కాని వాడు ఇప్పుడు నా గ్యాంగ్ కాదు. సత్తిగాడికున్న ఒకే ఒక weaknessని ఆ జిత్తు గాడు cash చేసుకున్నాడు. ఇక తప్పక అమ్మ దగ్గరికి వెళ్ళాను, అమ్మా నాకు డబ్బులు కావాలని అడిగా..
 
“ఎందుకురా” అని అడిగింది అమ్మ,
 
“అక్కడ నీ కోడలికి పెళ్ళమ్మా” అన్నాను,
 
ఎంతైనా తల్లి మనసు కదా! నాకన్నా ఎక్కువే  బాధపడుతుందని ఊహించి అమ్మ ముఖాన్ని చూసాను, మళ్ళీ అదే నవ్వు, ఈ సారి మాత్రం నా బాధ, కోపం కలిసి అమ్మని “నువ్వింత సాడిస్టువి అనుకోలేదు” అని చెడా మడా తిట్టేద్దామనుకున్నా..
 
ఇలా అనుకునేలోపే అమ్మ నా చేతిలో డబ్బు తీసుకొచ్చి పెట్టింది.  చూస్తే రెండు రూపాయిల బిళ్ళ.
 
దీనితో ఏం  చేసుకోవాలమ్మా ” అని కోపంగా అడిగా..
 
పోయి పీచు మిఠాయి కొనుక్కో” అంది అమ్మ
 
 ఇక చేసేదేమీలేక నా దగ్గరున్న అర్ధ రూపాయి తో కలిపి రెండున్నరపెట్టి ఎప్పుడోగాని ఊరిలోకిరాని పీచు మిఠాయి కొనుక్కున్నా..
 
ఇలా పీచుమిఠాయి కొనుక్కొని, తినకుండా, వాకిట్లోని అరుగు మీద కూర్చొని నేను కోల్పోయిన నా ప్రేమని తలుచుకుంటూ బాధపడతా ఉన్నాను. అప్పుడే సత్తిగాడు మా ఇంటి ముందునుండి అలా వెళ్తున్నాడు.
 
అప్పుడే నాకు సత్తిగాడి పీచు మిఠాయి weakness గుర్తొచ్చింది. నేను ఇవ్వనన్న పీచు మిఠాయిని ఆ జిత్తుగాడు ఇచ్చి సత్తిగాడిని వాడి గ్యాంగ్ లో కలిపేసుకున్నాడు. వెంటనే నాకు !dea వచ్చింది. సత్తిగాడిని పిలిచి ఆ మిఠాయిని వాడికి ఇచ్చేసా.. వాడు ఎగిరి గంతేస్తూ ఆ మిఠాయిని తీసుకున్నాడు, పనిలో పనిగా నా గ్యాంగ్ లో చేరమని షరతు కూడా పెట్టేసా.
 
సత్తిగాడు పీచుమిఠాయి తినేసాక నేను డబ్బులు అడుగుదామనుకున్నా. ఆ మిఠాయికి పొట్లాం కట్టిన కాగితంలో ఏదో తెలిసిన ముఖం ఉన్నట్లుందని విప్పి చూసా. అది నేను ప్రేమించిన అమ్మాయి పెళ్ళికి సంభందించిన వార్త..
 
” సినీ నటి శ్రీదేవి నిర్మాత బోనీ కపూర్ ని పెళ్ళి చేసుకోనుంది” అంటూ ఇద్దరి ఫొటోలు పక్క పక్కన ఇచ్చారు.
 
అది చూసి నా ప్రేమ విఫలమయిందనే బాధ నా నుండి ఒక్కసారి దూరమైపోయింది. నన్ను వదిలేసి ఒక ముసలివాడిని పెళ్ళి చేసుకుంటుందా, తనకి అంత అదృష్టం లేదనుకుంటా పాపం అని జాలి పడి, సత్తి గాడిని మళ్ళి నా గ్యాంగ్ లో చేర్పించిన ఆ పీచు మిఠాయికి మనసులో thanks చెప్పుకుంటూ జిత్తు గాడికి వార్నింగ్ ఇవ్వడానికి నా గ్యాంగ్ ని వేసుకుని వెళ్ళిపోయా..
(ఇదంతా చదివాక అప్పటికి నా వయసు ఎంతని అడగాలనుకుంటున్నారా? just 9 years అండి) 

Read Full Post »

అనుసరించు

Get every new post delivered to your Inbox.