Feeds:
టపాలు
వ్యాఖ్యలు

‘Review’ అనే వర్గంలోని టపాలు


ఆసాంతం హాస్యంతో నిండిన ఈ సినిమాలో కథ పాళ్ళు కాస్త తక్కువనే చెప్పాలి. కాని కథ ఒక్కటే కాదు ప్రేక్షకులను కట్టిపడేయడానికి కావల్సింది, స్క్రీన్ ప్లే మరియు మార్కెటింగ్ కూడా ఒక సినిమాకి అంతే అవసరం.

బొమ్మ

గుండె జారి గల్లంతయ్యిందే గురించి ఏమీ తెలియని ప్రేక్షకుడిని సినిమా థియేటర్ వరకు రప్పించే విషయాలలో పవన్ కల్యాణ్ ఒకటి. ఆయన అభిమానులకు కన్నుల పండుగగా ఉంటుంది ఈ సినిమా, ఒక పిచ్చి అభిమానిగా నితిన్ మరోసారి పవన్ మీద ప్రేమని ఈ సినిమాలో చూపించుకున్నాడు.

థియేటర్లో కూర్చునే ప్రేక్షకుడికి కావల్సినంత వినోదం ఈ సినిమాలో ఉంది, ఎక్కడా ఒక్క సన్నివేశం కూడా విసిగించకుండా దర్శకుడు, రచయిత చేసిన కృషి కనిపిస్తుంది. నటీనటుల విషయానికి వస్తే నితిన్ కి ఇది కెరియర్లోనే అత్యుత్తమ ప్రదర్శనగా నిలుస్తుంది. నిత్యామీనన్ మరోసారి తన పాత్రలో జీవించింది. నేటి తరం నటీమణుల్లో మచ్చుకైనా కనిపించని హావభావాలు, నటన ఆమె సొంతం. దాదాపు సినిమా ద్వితియ అర్దభాగమంతా నిత్యా మీనన్ ఒంటి చేతితో నడిపించింది అని చెప్పవచ్చు.

సంగీతం కన్నా పాటల చిత్రీకరణ అద్భుతం. పవన్ కల్యాణ్ తొలిప్రేమలోని ఏమయిందో పాట రీమిక్స్ అయితే మొత్తం సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది. నితిన్ డాన్స్ అంటే నేలమిద దొర్లటమే అని తెలిసిన తెలుగు ప్రేక్షకుడు అవాక్కయ్యేంతలా డాన్స్ ఇరగదీసాడు. హాస్యం కావాలని చొప్పించినట్లు లేకుండా జాగ్రత్తపడ్డాడు రచయిత. స్క్రీన్‌ప్లే అందించిన నటుడు హర్షవర్ధన్‌ని అభినందించకుండా ఉండటం కష్టం.

మొత్తంగా చెప్పాలంటే ఈ సినిమాతో నితిన్ మళ్ళీ సూపర్ హిట్ కొట్టాడు, పవన్ అభిమానులకు అమితానందం కలిగిస్తుంది ఈ సినిమా.

నా రేటింగ్: 4/5

 

Read Full Post »


మీరు పల్లెటూరు వెళ్ళి ఎన్ని రోజులయింది? అమ్మ, నాన్నలను లేదా అమ్మమ్మ/నాన్నమ్మ తాతMidhunam Movie Telugu Review య్యలను చూసి ఎన్నాళ్ళవుతోంది? మీ చిన్నప్పటి సంగతులు, తాతయ్యలు చెప్పిన కథలు, ఇంటి పెరటిలో, వీధి గుమ్మంలో, ఏటి నీటిలో మీరాడిన ఆటలు ఇంకా గుర్తున్నాయా! చిన్నప్పుడు మీ సొంతూరిలో మీరున్న పెంకిటిల్లు మీకింకా గుర్తుందా.. ఇంటి పెరటిలో గోడకి కొట్టిన పిడకలు, గుమ్మానికి చల్లిన పేడ కల్లాపు, శాలలో పశువులు.. ఇవన్నీ చదువుతుంటే మనం మరచిన మన పల్లెటూరు గుర్తొస్తోంది కదూ!

మిథునం సినిమ మనం మరిచిపోయిన మన అమ్మమ్మలని, తాతయ్యలని మనకి మళ్ళీ గుర్తు చేస్తుంది. పల్లె అందాలు, పల్లె జీవితాలలోని ఆనందాలని మన ముందు నిలుపుతుంది. మీరు విడిచింది పెద్దలని ఒక్కరినే కాదు, వారి ఆప్యాయతను, ప్రేమను, అనుబంధాలని కూడా అని తెలిసేలా చేస్తుంది.

ఏన్నేళ్ళయింది.. ఒక అచ్చమయిన తెలుగు సినిమా చూసి..ఈ అమ్మ నాన్నలని చూసి మీ కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లుతాయి, ఆ వంటకాలని చూసి మీ నోరు ఊరక తప్పదు. K.విశ్వనాథ్ సినిమాలు చూస్తే కలిగే ఆనందం, ఆయన సినిమాలు కలిగించే ఆర్ధ్రత మళ్ళీ ఇన్ని రోజులకి కలిగించిందీ తెలుగు సినిమా.

ఒక ఇల్లు, ఒక అమ్మ, ఒక నాన్న.. రెండే పాత్రలు, ఎన్నో భావాలు, జ్ఞప్తికివచ్చే అనుభవాలు మనలని మన వూరికి తీసుకెళ్తాయి. ఎవరూ లేని ఆ ఇంటిలో మన అమ్మ నాన్న చేసే అల్లరి, వారు(కాదు మనం) కోల్పోతున్న అనుబంధాలు, వారి మధ్య కలిగే కోప తాపాలు, అలక పాన్పులు ఒక్కటేమిటి.. ఈ సినిమా అచ్చంగా మన అమ్మానాన్నల ప్రేమకథను మనముందుంచుతుంది.

Mithunam Telugu Review

గ్రామీణులకుండే ప్రకృతి ప్రేమను కూడా మనం ఈ సినిమాలో చూస్తాం. వారు పశువులపైనా, చెట్లపైన పెంచుకునే మమకారాన్ని మన కళ్ళకు కడుతుందీ సినిమా. ఒక సన్నివేశంలో తను అల్లారుముద్దుగా పెంచి

న లేగదూడ చనిపోయేసరికి వృద్ధ దంపతులు పడే వేదన నాకు మ ఇంట్లో చిన్నప్పుడు ఆవు చనిపోతే వెక్కి వెక్కి ఎడ్చిన అమ్మమ్మని గుర్తు చేసింది. “బాలు” బావిలో దిగి అందులో పడిన పాత సామాను తీయటం, లక్ష్మి తనకు తప్పిపోయిన సంబంధం గూర్చి దెప్పి పొడవడం, విదేశాలకు పోయిన కొడుకుల పేర్లను చెట్లకు పెట్టుకోవడం.. ఒక్కటేమిటి, సినిమాలో ప్రతీ సన్నివేశం మీకు ఇంతకుముందు అనుభవంలోకి వచ్చినట్లే ఉంటుంది, వచ్చుటుందేమో కూడా!

కొస మెరుపు: ఇది తెలుగు తెలిసిన ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా, తమదని గర్వంగా చెప్పుకోవాల్సిన సినిమా, చూసి ఆనందించాల్సిన సినిమా!

Read Full Post »


ఒక సామాన్యుడికి వ్యవస్థ మీద కోపమొస్తే ఏమవుతుంది? ఒకరి కోపమైతే ఆవేదన గానే మిగిలిపోతుంది, అదే లక్షలాది కోపాన్ని ఒక్కరే అనుభవిస్తే ఒక ఉద్యమం ఉద్భవిస్తుంది.. అదొక ఉప్పెనవుతుంది.. విప్లవమవుతుంది..

Cameraman gangato rambabu review, CGR reviewఒక సాధారణ మెకానిక్ కుళ్ళు రాజకీయాలని చూసి ఎలా react అవుతాడొ రాంబాబు చూపిస్తాడు. రెండు సార్లు అధికారం అనుభవించాక, ప్రతిపక్షంలో కూర్చున్న “బాబు” గారి కుతంత్రాలు ఎండగొడతాడు. తండ్రి పోయాక “కొడుకు” చేస్తోన్న శవ రాజకీయాలను కడిగేస్తాడు.. ప్రాంతం పేరుతో జనాన్ని భయభ్రాంతులని చేసే నాయకులని తరిమి తరిమి కొడతాడు.

నా గబ్బర్ సింగ్ రివ్యూ అంతా పవన్ కల్యాణ్ గురించిన రాతలతో నిండిపోయింది, ఈ రివ్యూ మాత్రం సామాన్యుడికి అంకితం చేస్తున్నాను. ఈ సినిమాలో మనకి Power Star కనిపించడు, ఆవేదన నిండిన అతి సామాన్యుడు కనిపిస్తాడు, సామాన్యులని ఆడించే నేతలు కనిపిస్తారు, ఆ నేతల చేతుల్లో పావుగా మీడియా, అదే మీడియాని పావుగా వాడుకుని ఒక సామాన్యుడు చేసే యుద్దం కనిపిస్తుంది.

ఈ సినిమా ప్రధమార్దం నెమ్మదిగా ఉన్నా, ద్వితియార్ధం అధ్భుతంగా సాగుతుంది. లెక్కలు మార్చే సినిమా కాదు గాని, లెక్కకందని కలెక్షన్స్ మాత్రం ఖాయం!

రేటింగ్: 3.5/5

Read Full Post »


Andala Rakshasi Telugu Movie Review!

శపించెనే నన్ను నా గతం
ఆలస్యమైందని తనకు నా పరిచయం
నువ్వేనట ఇకపై నా జీవితం
శాపం అయినా వరంలా తోచేనే ఈ క్షణం!!

ఎంత అందమైన వ్యక్తీకరణ! ప్రాణంలాంటి ప్రేయసి పరిచయం..ఆలస్యమైతే కలిగే అనుభూతి, పరిచయమైనా తనకి దక్కలేదనే బాధ.. తన సాంగత్యమే వరమనే భావన కలుగిస్తుంది ఈ చిరు కవిత. ఇదే భావన ఈ వారాహి చలన చిత్రం చూసిన ప్రేక్షకుడికి కూడా కలుగుతుంది. పిడుగు లాంటి గతాన్ని గుండెల్లో అణుచుకొని, వరంలాంటి వర్తమానాన్ని వరించలేని ఒక నిస్సహాయ అమ్మాయి కథ ఇది. ప్రేయసి కోసం, తన ప్రేమకోసం తపించే ఇరువురి యువకుల కథ ఇది.

ఈ సినిమా చూసినవారందరికి నచ్చుతుంది అని చెప్పలేను. సినిమాలో ఓ చోట ఒక పాత్ర “చూడగలిగేదే ప్రేమ ఐతే, అది ఉందని కూడా నాకు తెలిసేది కా”దంటాడు. ఎంత ప్రేముందో చూపించు అన్న హీరోయిన్‌కి ఒక అంధుడు(నరసింహరాజు)చెప్పే డైలాగ్ అది. ప్రేమ మనసుతో అనుభవించేదేగాని కల్లతో చూసేది కాదని దాని అర్థం, ఈ సినిమా చూసే ప్రేక్షకుడికి కూడా ఇదే వర్తిస్తుంది.

“వాలిని చెట్టు చాటునుండి చంపిన రాముడు, చంపించిన సుగ్రీవుడు నరకానికి వెళ్ళినట్లు ఎక్కడా లేదు”
“చంపేది రాముడినే అయితే..”
“ఒక అవతారం అంతరిస్తుంది, అంతే” రెండు పాత్రల మధ్య నడిచే సంభాషణ ఇది. దేవ కట్టా ప్రస్థానంలో రాసిన పురాణాల డైలాగ్ తర్వాత నన్ను అంతగా ఆకట్టుకున్న డైలాగ్ ఇదేనని చెప్పాలి.

ఈ సినిమాకి ప్రధానాకర్షణ నటీనటులు, చిత్రీకరణ, దర్శకత్వం, సంగీతం. కానీ చూసే ప్రతీ ఫ్రేములో అందాల రాక్షసి కన్నా ఎక్కువగా గీతాంజలి కనిపించడం పెద్ద మైనస్సనే చెప్పాలి. పక్క పక్కనే వుండే నటుల మధ్య సంభాషణ అరుపులుగా సాగడం సాధారణ ప్రేక్షకుడికి కాసింత విసుగుని, కోపాన్ని కలిగిస్తుంది. వెన్నంటే ఉంటున్న పాట “నిర్ణయం” సినిమాలోని హలో గురూ చిత్రీకరణని పోలి ఉంటుంది.

సినిమా ప్రథమార్దం కొంత నెమ్మదిగా ఉన్నా, ద్వితియార్దం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సంగీతం, కెమెరా పనితనం సినిమాకి ప్రాణంగా నిలుస్తాయి. 90లలో యువతకి ఉన్న సున్నితత్వం, అమాయకత్వం ఇప్పటికి యువతకి లేనందునే అప్పటి నేపధ్యం తీసుకున్నామన్న దర్శకుని మాటతో ఏకీభవించక తప్పదు. ఇంకా ఆ సున్నితత్వం మిగిలున్న ప్రేక్షకుడికి ఈ సినిమా తప్పక నచ్చుతుంది.

నా రేటింగ్: 4/5

Read Full Post »


eega telugu cinema review

కొన్ని సినిమాలు హిట్ అవుతాయి, కొన్ని సినిమాలు సూపర్ హిట్లు, బ్లాక్‌బస్టర్లు అవుతాయి.. కొన్ని మాత్రం సినిమా చరిత్రలనే తిరగరాస్తాయి, పరిశ్రమకు దిశానిర్దేశం చేస్తాయి, చరిత్రలో నిలిచిపోతాయి. అటువంటి సినిమాలలో “ఈగ” తప్పక నిలుస్తుంది. బ్లాక్‌బస్టర్ల మీద బ్లాక్‌బస్టర్లు కొడుతున్న తెలుగు సినీ పరిశ్రమకు “ఈగ” మరో ఆణిముత్యమవుతుంది!

“ఈగ” సినిమా నవ యువ విఠాలాచార్యుడిని మనకి పరిచయం చేస్తుంది. అబ్బో అనిపించేలా, ఉబ్బితబ్బిబ్బయ్యేలా, ఇది మా తెలుగు సినిమా అని గర్వంగా తలెత్తుకునేలా, భారతీయ సినిమా నిర్మాణపు విలువలు ఇలా ఉంటాయా అని హాలివుడ్ కూడా ఉలిక్కిపడేలా చేస్తుంది.

గబ్బర్ సింగ్ సినిమా చూసొచ్చి ఎంత ఆనంద పడ్డానో అదే ఆనందం మళ్ళీ ఈగతో కలిగింది, చెప్పినట్లే గబ్బర్ సింగ్ లెక్కలు చుక్కల్ని తాకాయి.. కానీ ఆ లెక్కల్ని కూడా పక్కకి నెట్టి ఈగ ఎవరికీ అందనంత దూరం ఎగిరిపోయినా ఆశ్చర్యపడనవసరం లేదు. ఈ సినిమా తెలుగు సినిమా గతిని, గమ్యాన్ని, దిశని, దశని మారుస్తుందనే నమ్మకం నాకుంది.

తెలుగు సినిమాలకు, తెలుగు సాంకేతిక నిపుణులకు మొండిచెయ్యి, అవమానం ఎదురవుతున్న ఈ రోజుల్లో గబ్బర్ సింగ్, ఈగ సినిమాలు వచ్చి తెలుగు సినిమా స్టామినా ఎంటో ప్రపంచానికి తెలియజేసాయి. దాదాపు పదేళ్ళ క్రితం వరకు సినిమా రంగంలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండిన మన తెలుగు సినీ పరిశ్రమ మరోసారి భారతీయ సినిమాకి దిశా నిర్దేశం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

రాజమౌళి గురించి ప్రత్యేకంగా ప్రస్థావించనవసరంలేదు, ఈ సినిమాతో మరో విఠలాచార్యుడు అవతరించాడు! కీరవాణి కన్నా గొప్ప సంగీత దర్శకుడు ప్రస్తుతానికి తెలుగు సినీ పరిశ్రమలో లేడు అని రూఢీ అయింది, సెంథిల్ కేమెరా పనితనం హాలీవుడ్ స్థాయిలో ఉంది, కోటగిరి ఎడితింగ్ ప్రేక్షకుడిని కట్టిపడేసింది. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే ఇది నటుల సినిమా కాధు, టెక్నీషియన్ల సినిమా! పాతికేళ్ళు పరిశ్రమలో ఉన్నా హావభావలు పలికించలేని, నటన అబ్బని “నటులు” ఉన్న మన పరిశ్రమలో ఎటువంటి హావభావాలు లేని, చప్పుడు చేయలేని ఒక చిన్న ఈగని హీరోగా మలిచి చిత్రించడమంటే సాషారణ విషయం కాదు.

కొసమెరుపు: వందల కోట్లు పెట్టి నిర్మిస్తున్న హాలీవుడ్ సినిమాలకి ఏ మాత్రం తీసిపోని సినిమా ఇది. తెలుగు సినిమా.. ఇంకా చెప్పాలంటే భారతీయ సినిమా ముఖ చిత్రాన్నే మార్చివేసే సినిమా అవుతుంది!! హ్యాట్సాఫ్ రాజమౌలి సార్!!!!!!!

Read Full Post »


 

Image

అద్భుతమైన దర్శకత్వం, ఆకట్టుకునే మాటలు, ఆకర్షించే హీరోయిన్లు, హృదయాన్ని తాకే సన్నివేశాలు.. వీటికితోడు మహాద్భుతమైన నటన.. కలగలిపి అధినాయుకుడు అనే అద్భుత చిత్రరాజాన్ని మనముందించాయి.

రేటింగ్: ఇటువంటి సినిమా రేటింగ్లకు అందనిది

కొసమెరుపు: ఏం చూసానో తెలియదు, ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు!

 

Read Full Post »


Power Star Pawan Kalyan Gabbar Singh Telugu Review

తిక్క PEAK కి వెళ్తే లెక్కలు చుక్కల్ని తాకుతాయి. కాసింత ఎత్తుకే విర్రవీగే వెర్రి మేఘాలను దాటుకుంటూ.. ఆకాశం ఎక్కడుందో వెతుక్కుంటూ చేరతాయి. ఆకాశాన్ని కమ్మేసి తామే ఆకాశమనుకుని ఒక అబద్దపు ఆనందాన్ని పొందే మేఘాలకి ఆకాశపు స్థానమేంటో పాపం తెలియడానికి ఎంతో సమయం పట్టదు. ఒక్క వర్షానికే కరిగి నేలకి చేరుతుంది మేఘం, తల పైకెత్తి చూస్తే నిరాడంబరంగా నిలబడి కనిపిస్తుంది ఆకాశం. మేఘమే ఆకాశమని భ్రమపడే సామన్యునికి, నేలకి చేరిన మేఘానికి.. మిడిసిపాటు తగదని, ఎవరి స్థానంలో వారే ఉంటారని చెప్పకనే చెబుతుంది. అప్పుడే ఈ వెర్రి మేఘాలకి, అతి సామన్యుడికి అర్దమవుతుంది “తన స్థాయి వేరు, ఆ స్థానం వేరు” అని!

వూరికే ఉరిమే మేఘానికి, ప్రశాంతంగా ఉండే ఆకాశానికి ఎంత తేడా ఉందో తెలుగు సినీ పరిశ్రమలో మిగిలినా కథా నాయకులకి పవన్ కళ్యాణ్‌కి అంతే తేడా ఉంది. నాలుగేళ్ళుగా మూడు యావరేజ్, ఫ్లాప్ సినిమాలు ఇచ్చిన హీరో మీద ఎందుకింత అభిమానం! రాజకీయాళ్ళో చేరి అన్నని గెలిపించలేని హీరో మీద ఎందుకింత పిచ్చి? ఈ అభిమానం, వెర్రి నటన వలన వచ్చాయా? అలా ఐతే సినిమాలతో పాటు ఇమేజ్ కూడా పోయేది ఎప్పుడో! అంకెలు, లెక్కలతో పనిలేదని, “చరిత్ర”లను చెత్తబుట్టలో పడేయాలని చెప్పే ఒకే ఒక్క నటుడు పవన్!

గబ్బర్ సింగ్ రివ్యూని పవన్ మీద ప్రేమతో ఇలా రాస్తున్నందుకు క్షమించాలి. పోయిన సినిమాలకి కూడా మొదటి రోజు సక్సెస్‌మీట్లు జరుగుతున్న ఈ రోజుళ్ళో సినిమా ఎలా ఉన్నా దానిని ప్రేక్షకునికే వదిలేసే నటులు ఎంతమంది? పెద్ద నటులుగా చలామణి అవుతూ కూడా చీప్ పబ్లిసిటీ చేసుకునే హీరోలు ఉండే ఈ పరిశ్రమలో పవన్‌లాంటి నటులెంతమంది?? అసలు పవన్‌ని నటుడు అంటే అతనిని ఒకే వర్గానికి పరిమితం చేసినవాడిని అవుతాను. పవన్ ఒక నిజాయితీ వ్యక్తి, కాలాతీత శక్తి!

కులాలు, మతాలు, ప్రాంతాలుగా విడిపోయిన ఈ సమాజంలో అన్నింటికీ అతీతంగా ఉండే అభిమానం చాలా అరుదు! కాని పవన్ అభిమానులను చూడండి, గర్వంగా తలెత్తుకు తిరుగుతారు! ఒక సినిమా పోతేనేం, వంద సినిమాలు పోతేనేం.. తాము అభిమానులయ్యింది ఆయన సినిమాలు చూసినాకే గాని ఆయనతో నిలబడింది మాత్రం ఆ CHARACTER వల్లనే అని కాలరెగరేస్తారు! Character కోల్పోతున్న పరిశ్రమలో ఒక నీతీ నిజాయితీ punctuality ఉన్న వ్యక్తికి లభించే గౌరవమే ఇది!

నేను వందలాది సినిమాలు చూసాను, కాని ఏ సినిమాకి కూడా థియేటర్ నుండి బయటికొచ్చిన ప్రేక్షకుడు జిందాబాద్లు కొట్టడం చూడలేదు. పవర్‌స్టార్ జిందాబాద్ అంటూ బయటికొచ్చిన వందలాది అభిమానులు సినిమా చూడకుండానే ఎలా వుందో మాకు చెప్పేసారు. అంకెలు, లెక్కలు మార్చే సినిమా ఇది అని గర్వంగా చెప్పుకున్నారు.

పవన్‌కి ఒక fan డైలాగులు రాస్తే, డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో గబ్బర్‌సింగ్‌తో హరీష్ శంకర్ చూపించాడు. పవన్‌లో ఎనర్జీని ఎలా వాడుకోవాలో అలా వాడుకున్నాడు. పవన్ నటన అద్భుతమనే చెప్పాలి, శ్రుతి హాసన్ కూడా ఆకట్టుకుంటుంది. దేవిశ్రీ అద్భుతమైన సంగీతం అందించాడు.

ప్లస్ పాయింట్లు:

1. పవన్‌కళ్యాణ్
2. పవన్‌కళ్యాణ్
3. పవన్‌కళ్యాణ్
4. మిగిలినవన్నీ

మైనస్ పాయింట్లు:

ఏం లేవు

రేటింగ్: 4.5/5

కొసమెరుపు: లెక్కలు మారుతాయి, చరిత్ర పునఃలిఖింపబడుతుంది!

Read Full Post »


NTR dhammu review, telugu review, dammu review

NTR dammu telugu review


హ్యాట్రిక్ విజయాల డైరక్టరంటే అంచనాలు భారీగానే ఉంటాయి, అది కూడా సింహాలాంటి హిట్ ఇచ్చిన డైరక్టర్ బోయపాటి, యంగ్ టైగర్ NTRల సినిమా అంటే అంచనాలకి ఆకాశమే హద్దు! కాకపోతే ఈ అంచనాలని అందుకోవడంలో బోయపాటి విఫలమయ్యాడనే చెప్పాలి.

కథ, కథనం:

రెండు కుటుంబాల మధ్య సాగే వైరం నేపథ్యంగా కథ ఉంటుంది. NTR హైదరాబాద్లో అనాథ, ఆయనకి ఆ వైరానికి మధ్యనున్న సంభంధమే ఈ “దమ్ము”. కథ పరవాలేదనిపిస్తుంది కానీ కథనం సరిగా లేకపోవడంతో థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడు అసహనానికి గురవక తప్పదు. రెండో భాగంలో వచ్చే ఫైట్లు కూడా సినిమాకు పెద్ద మైనస్సనే చెప్పాలి.

నటన:

ఎమోషనల్ సన్నివేశాలలో NTR బాగా నటించాడు, NTR నటన సినిమాకి ప్లస్ పాయింటనే చెప్పాలి. కార్తికాతో చెప్పించిన డబుల్ మీనింగ్ డైలాగులు ప్రేక్షకుడికి చిర్రెత్తిస్తాయి, త్రిషా పాటలలో కనిపిస్తుంది. “కోట” లాంటి సీనియర్ నటుడిని సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు. విలన్‌గా నాజర్ అధ్బుతంగా నటించాడు. సుమన్, భానుప్రియ, వేను, ఆలి నామమాత్రపు పాత్రలకే పరిమితమయ్యారు.

దర్శకత్వం, సంగీతం:

ఈ సినిమాకి దర్శకత్వలోపం స్పష్టంగా కనిపిస్తుంది, దర్శకుడు కథని మాస్ మసాలా సినిమాగా మార్చడానికి కష్టపడినట్లు కనిపించినా బోరింగ్ సన్నివేశాలు సినిమాని దిగజార్చాయి. సినిమాలో కథ పెద్దగా లేకపోవడంతో ఏం జరగబోతుందోనన్న ఉత్కంఠ ప్రేక్షకుడికి మిగలదు.

కీరవాణి సంగీతం సినిమాకి పెద్దగా ఉపయోగపడలేదు, రీరికార్డింగ్ అదరగొట్టే కీరవాణి ఈ సినిమాకి మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. వాస్తు బాగుందే పాట చిత్రీకరణ బాగుంది. రూలర్‌లాంటి మంచి పాటని సరిగా చిత్రీకరించలేదు.

ప్లస్ పాయింట్లు:

1. భావోద్వేగ సన్నివేశాలలో NTR నటన
2. వాస్తు బాగుందే పాట
3. నాజర్ నటన
4. డైలాగులు

మైనస్ పాయింట్లు :

1. కథనం
2. రూలర్ పాట, సంగీతం మరియు రీరికార్డింగ్
3. పొడుగు హీరోయిన్లు(కేమరామ్యాన్ ఎంత కవర్ చేసినా కుదరలేదు)
4. డబుల్ మీనింగ్ డైలాగులు
5. సెకెండ్ హాఫ్
6. వంశం పేరుతో డైలాగులు

కొసమెరుపు: ఇది మాస్ సినిమా, నగర ప్రేక్షకులని అలరించకపోవచ్చు. నందమూరి అభిమానులకు నచ్చే అవకాశం ఉంది(నాతో వచ్చిన NTR అభిమానికి నచ్చలేదు). రచ్చ సినిమా సూపర్ హిట్ కావడంతో ఇది కూడా ఆ బాటలో నడిచి ఆడుతుందేమో వేచి చూడాలి. సగటు ప్రేక్షకుడిని అలరించే అంశాలు పెద్దగా లేవు.

రేటింగ్: 2.75/5

Read Full Post »


సినిమాలను మాస్ అని, క్లాస్ అని విడదీయడం బహుశా మనదేశంలో తప్ప ఇంకెక్కడా ఉండదేమో! దీనికి మనదేశ సాంఘిక పరిస్థితులు కూడా ఒక కారణమని చెప్పొచ్చు. ఈ మధ్య కొత్త తరహా మల్టీప్లెక్స్ సినిమాలని కూడా వస్తున్నాయి. ఈ మధ్య వచ్చిన లవ్ ఫెయిల్యూర్, LBW సినిమాలు ఆ కోవకి చెందినవే!
Racha Ram Charan
విచిత్రం ఏమిటంటే ఇవి ఏ తరహా చిత్రాలో ముందే నిర్మాత దర్శకులు ప్రేక్షకులకు చూచాయిగా తెలియజేస్తున్నారు. సినిమా చూడటానికి వచ్చిన ప్రేక్షకుడికి అది ఏ తరహా చిత్రమో ముందే చెప్పి ప్రేక్షకుడిలోని కన్‌ఫ్యూజన్‌ని తొలగించటమే వారి ఉద్దేశ్యం. “రచ్చ” విషయానికి వస్తే ఇది ఒక మాస్ సినెమా, ఇంకా చెప్పాలంటే “ఇది పిజ్జా, బర్గర్లు తినేవాళ్ళకోసం కాదు.. జొన్న రొట్టే, రాగి సంకటి తినేవాళ్ళకోసం”

రచ్చ సినిమా, 90లలో చిరంజీవి సినిమాలని గుర్తు చేస్తుంది. Larger than the life image ఉండే కథలు మొదలయ్యింది ఆ కాలంలోనే! చిరంజీవి, రజనీలను సూపర్ స్టార్లు చేసింది కూడా ఆ కథలే. సరిగ్గా ఇలాంటి కథతోనే రాం చరణ్ తో రచ్చని ప్లాన్ చేసాడు సంపత్ నంది. ఆరెంజ్ బాక్స్ ఆఫీసు దగ్గర బోల్తా కొట్టడంతో ఈ సారి రొటీన్ సినిమాను ఎంచుకున్నాడు చరణ్.

కథ విషయానికి వస్తే గల్లీ కుర్రోడు బెట్టింగ్ రాజ్, పందెం కట్టి హీరోయిన్ని పడేస్తాడు. ఈ పందేనికి, హీరోకి, హీరోయిన్‌కి ఉన్న సంబంధమే కథ. కథా కథనాలు కేవలం మాస్ ప్రేక్షకుడిని దృష్టిలో పెట్టుకునే తీర్చిదిద్దారు. రాం చరణ్ బెట్టింగ్ రాజ్ పాత్రలో పరవాలేదనిపించాడు. తమన్నా తన అంద చందాలతో సినిమాకు విలువ పెంచింది. ఇద్దరూ తమ తమ డాన్సులతో ప్రేక్షకులని మురిపించారు. ముఖ్యంగా వానా వానా, ఢిల్లక్ ఢిల్లా పాటలు ప్రేక్షకుడిని మురిపిస్తాయి.

ప్లస్ పాయింట్లు:

1. కథనం, దర్శకత్వం
2. డైలాగులు
3. డాన్సులు, పాటలు
4. బ్రహ్మానందం

మినస్ పాయింట్లు:

1. టైటిల్ సాంగ్ కొరియోగ్రఫీ
2. చిరంజీవిని ఇమిటేట్ చేయడం
3. ఆలి, జయప్రకాష్ రెడ్డిల కామెడీ

కొసమెరుపు: ఈ సినిమా మాస్ ప్రేక్షకునికోసం, హారర్ సినిమాకి వెళ్ళి కామెడీ సినిమాని ఎలా ఎక్స్పెక్ట్ చేయకూడదో ఈ సినిమాకి వెళ్ళి కథ, కథనం, లాజిక్లను అలా ఎక్స్పెక్ట్ చేయకూడదు. మెగాభిమానులను అలరించే సినిమా.

రేటింగ్: 3.5/5

Read Full Post »


దాదాపు ఏడేళ్ళ క్రితం జరిగిన ఒక సంఘటన నేను జీవితాంతం మర్చిపోలేను. ఇంటర్ చదువుతున్నప్పుడు మాకు ఆదివారం వస్తే ఒక పండుగలా ఉండేది. ఎప్పుడెప్పుడు జగదాంబ సెంటర్ కి వెళ్తామా, ఎప్పుడు ఏదైనా హాల్ లో దూరి సినెమా చూస్తామా అని ఆ ఆరు రోజులూ తెగ ఎదురుచూసేవాళ్ళం. ఆదివారం వచ్చేసరికి ఇక మా ఆనందానికి హద్దులుండేవి కావు.

కానీ ఒకానొక ఆదివారం నా జీవితాన్ని మలుపు తిప్పిందనే చెప్పుకోవాలి. ఆ రోజు వీకెండ్ టెస్ట్ రాసి కాస్త ఆలస్యంగా జగదాంబ సెంటర్ కి చేరిన మాకు ఏ థియేటర్లోను టికెట్లు దొరక్క వెనుదిరుగుతుండగా మెలోడీ లో ఆడుతున్న ఒక సినిమా పోస్టర్ మీద మా చూపు పడింది. ఒక ప్రయత్నం చేస్తే పోలా అని మెలోడీ కి వెళ్ళి మా ఆరుగురం టికెట్స్ తీసుకున్నాం. దాదాపు అరగంట ఆలస్యంగా వెళ్ళినా టికెట్లు దొరకడంతో ఉబ్బితబ్బిబయి లోపలికి వెళ్ళి కూర్చున్నాం.

కూర్చున్నామో లేదో హీరో కాస్తా విలన్ ఇంటికి వెళ్ళి తనగురించి తను ఏదో చెప్తున్నాడు. ఒక ఐదు నిమిషాలు ఏమీ అర్థం కాక తలలు పట్టుకున్నాక హీరో చెప్పిన చివరి డైలాగ్ యస్ యస్ యస్ భవానీ ప్రసాద్ మాత్రం అర్థమైంది. పేరు చెప్పడానికి పది నిమిషాలు డైలాగ్ ఎందుకురా బాబు అనుకుంటుండగానే హీరొ గారు తొడ కొట్టడాలు, ట్రైన్లను ముందుకీ వెనక్కి తొడాగొట్టడంతో వచ్చిన పవర్ తో నడిపించడాలు, ఇంకా చాలా చిత్ర విచిత్రాలు జరిగిపొయాయి.

అసలు ఏం జరుగుతందో అర్థం కాక థియేటర్ లో జనమంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటుండగానే సినిమా శుభం కార్డ్ పడింది. బ్రతుకుజీవుడా అనుకుంటూ జనం సినిమాహాల్ నుండి బయటికిరావడం తొలిసారి చూసాను. అందరి ముఖాలలోనూ కొట్టొచ్చినట్లు కనిపించిన చావుకళని చూస్తే నాలానే అందరికీ చావు పరిచయమైందని అర్థమైంది. పలనాటి బ్రహ్మన్నాయుడు అనబడే ఆ సినిమాని నేను జీవితాంతం మర్చిపోలేను. బాలయ్య సినిమాలను జీవితంలో మరి చూడను అని నా మీద నేనే ఒట్టేసుకునేట్లు చేసిందా సినిమా..

ఇదంతా గతం. వర్తమానంలోకి వస్తే.. హైదరాబాద్,జనవరి 12వ తేదీ, సాయంత్రం 8.30 అయింది. అప్పుడే ఇంటికి వెళ్ళడానికి ట్రైన్ తప్పిపోయిందని నా స్నేహితుడి నుండి ఫోన్ వచ్చింది. సరే, ఏదైనా సినిమాకి వెళ్దామని అన్నా.. పరమవీరచక్ర చూద్దామని వాడు చెప్పాడు, అరెయ్ ఇంకేదైనా సినిమాకి వెళ్దాం రా అని బ్రతిమాలా.. వినలేదు. ప్రాధేయపడ్డా.. పట్టించుకోలేదు. ఎంతకీ నా మాట వినకపోయేసరికి, అరే మొదటిరోజు మనకి టికెట్లు దొరకవు లైట్ తీస్కోమన్నా! ఐనా సరే దొరుకుతాయి ముందు బుక్మైషో.కాం తెరిచి చూడమన్నాడు. తెరిచి చూస్తే 8.30 తర్వాత మొదలయ్యే అన్ని షోలకి, అన్ని హాళ్ళలోను టికెట్లు పుష్కలంగా ఉండటంతో తప్పక సినీమ్యాక్స్ లో రాత్రి 10:45 ఆటకి మూడు టికెట్లు తీసా.

మళ్ళీ దాదాపు ఏడేళ్ళ తర్వాత అదే సీను. హైటెక్ సిటికి వెళ్ళే దారిలో అండర్ బ్రిడ్జ్ దగ్గర ట్రాఫిక్ జాం కావడంతో అప్పటికే లేట్ గా బయల్దేరిన మాకు మరికాస్త ఆలస్యమై దాదాపు 30 నిమిషాల తర్వాత వెళ్ళాం. అప్పటికే ఆకలితో ఉన్న మాకు మూసేసిన KFC ని చూసి పీకలదాకా కోపం(మా మీద మాకే) వచ్చింది. చివరికి దొరికిన గడ్డిని తీసుకుని థియేటర్లో దూరాము. పక్కనున్న అమ్మాయిలని కూడా పట్టించుకోకుండా సినిమా మీదే concentration పెట్టాం.

బాలయ్య మాంచి ఊపు మీద ఉన్నాడు. లేబర్ నాయకుడిగా చెలరేగిపోతున్నాడు, బాలయ్య కి పోటీగా ఇనుప కాళ్ళ రోజా కూడా కుమ్మేస్తుంది. అప్పుడే బాలయ్యకి కథ చెప్పడానికి income Tax ఆఫీసర్(మీరు విన్నది నిజమే) ఒకడు వస్తాడు. బాలయ్యని ఫ్రీ గా సినిమా చేసి పెట్టమని అడుగుతాడు. బాలయ్య కథ నచ్చితే ఫ్రీగానే చేసేస్తానని చెబుతాడు. తర్వాత బాలయ్యకి కథ చెప్పడానికి కొంతమంది మిలటరీ ఆఫీసర్లు వస్తారు. అప్పుడు మరొక హింస మొదలవుతుంది, మేజర్ జయసింహ రూపంలో మరొక బాలయ్య ఎంటరవుతాడు.

మేజర్ జయసింహ గురించి ఆర్మీ ఆఫీసర్లు వర్ణించడంతో హీరో బాలయ్యకి జయసింహ పూనుతాడు. దానితో తను సెట్లో చెప్పాల్సిన డైలాగ్ మర్చిపోయి “నన్ను కొడితే చావాలి, నేను కొడితే చావాలి” అని జనాన్ని పదే పదే చావగొడతాడు. ఆగండాగండి.. ఇంకా కథ మొదలవలేదు. ఈ ఆర్మీ ఆఫీసర్లు ఆ చావాలి వరకే కథ చెప్పి మిగతా సగం చెబితే కుదరదని ప్రత్యక్షంగా చూడాల్సిందేనని చెప్పి బాలయ్యని హిమాలయాలకి తీసుకెళ్తారు. అక్కడ మన బొర్రా గుహల్లాంటి గుహల్లో జయసింహకి ట్రీట్మెంట్ ఇస్తా ఉంటారు(నాలుగేళ్ళూగా అలానే పడున్నా ఈ జయసింహకి కొంచెం కూడా గడ్డం పెరగదు, క్షమించండి LOGIC మాట్లాడినందుకు) ఇప్పటికి మొదటి సగం సినిమా పూర్తయింది. దీనితో అప్పటికే సగం కూడా నిండని థియేటర్ , ఉన్నవాళ్ళలో సగం మంది వెళ్ళిపోవటంతో ఇంకా ఖాళీ అయిపోయింది.

సినిమా రెండవ భాగంలో జయసింహని దేశద్రోహిగా చిత్రీకరించిన “హ్రుదయవిదారకమైన” కథని మన హీరో కి చెబుతారు. ఇక్కడ బలయ్య ఒక ఆంగ్ల డైలాగ్ ని భలే చెబుతాడు(something is going wrong sir అని బాలయ్య చెబుతుంటే ఈల వేయని ప్రేక్షకుడు లేడంటే నమ్మండీ). తర్వాత మేజర్ స్థానంలో మన హీరో గారు దూరుతారు. హీరొ గారి తక్షన కర్తవ్యం అతని ఇంఫార్మెర్ ని కలుసుకుని అతను ఇచ్చిన సమాచారాన్ని తీసుకోవటం. ఆ informer పాపం జయసిమ్హని తప్ప వేరే ఎవరిని గుర్తించలేడంటే మన బాలయ్య సై అని వెళ్తాడు. మన informer మాత్రం ముష్టివాడిలా ముసుగేసుకుని వచ్చి జయసింహ! జయసింహ! అని అరుస్తుంటాడు(అదే మరి variety అంటే). జయసింహ అప్పుడు కేక లాగ informer దగ్గరనుండి పెన్ డ్రైవ్ తీసుకుంటాడు. అందులో ఉన్న ఫొటోలను (దాశరి ఇక్కడ ఫొటోషాప్ ని భలే effectiveగా వాడుకున్నాడు )చూసేసరికి జయసింహకి విలన్ ఎవరో తెలిసిపోతుంది.

ఆ తర్వాత ఇంకా చెప్పాల్సింది ఏముంటుంది.. బాలయ్య చెలరేగిపోయి సింహం అని, నరసింహం అని ఏవేవో డైలాగులు కొట్టి జనాన్ని హింసిస్తాడు. మురళిమోహన్ కూడా తానేమీ తక్కువతినలేదన్నట్లు అడవిలో సింహం అని, జూలో సింహం అని చెప్పి ప్రేక్షకులకు పరీక్ష పెట్టి మరికొన్ని అధ్బుతమైన డైలాగ్లతో సినిమాను ముగిస్తారు.

సినిమా అంతా బాలయ్య ఎక్కడ కనిపించిన, డైలాగ్ చెప్పినా ఈలలు, చప్పట్లు, గోలలు.. సినిమా చూసి మూసుకుని కూర్చున్నది ఎవరైన ఉన్నారు అంటే అది ఒక్క బాలయ్య అభిమానులు మాత్రమే! ఎందుకో నాకు ఒక్క అభిమాని కూడా కనిపించలే..
సూచన: ఈ రివ్యూ చదివి సినిమా చూసినవారికీ,నాకు ఎటువంటి సంభంధం లేదు.

Read Full Post »

అనుసరించు

Get every new post delivered to your Inbox.