Feeds:
టపాలు
వ్యాఖ్యలు

‘beep the world’ టాగుతో ఉన్న టపాలు


ఏదో రాయాలి.. ఎన్నాళ్ళయిందో, ఎన్నేళ్ళయిందో, మనసుకి నచ్చేది మనసుని గుచ్చేది రాసి! రోడ్డు మీద పోయేవాడ్ని ఎవడ్నైనా ఆపి ఠాప్ అని ఒకటి పీకి అడగాలనిపిస్తుంది నేను ఎందుకు రాయట్లేదా అని! వాడి దగ్గర సమాధానం ఉండదని తెలుసు, నాకు కావల్సింది సమాధానం కాదు, నన్ను నేను సమాధాన పర్చుకోవడమూ కాదు! నా beep తీరాలి. అంతే!

ఒక్కోసారి ఈ ప్రపంచం ఏంటో, నేనేంటో అర్దం కాక తల గోక్కుంటుంటాను! మనిషి అవసరం మనిషికే తప్ప మరొకడికి లేనప్పుడు మనిషికి మనిషి ఎందుకు సాయపడడో అర్దం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాను. చల్ హట్.. మనిషంటేనే స్వార్థం, తనకోసం తను బ్రతికేవాడు స్వార్ధపరుడు కాక ఏమవుతాడు! ఐనా సరే అన్నీ వదిలి అన్నల్లో చేరి నిస్వార్ధంగా ఉండాలనిపిస్తుంటుంది. ప్రపంచాన్ని మనిషి నడిపిస్తున్నాడో మనీ నడిపిస్తుందో తెలియక తికమక పడుతుంటాను, మనీ నడిపిస్తుంటే నడిచే మనుషుల్ని చూసి తలదించుకుంటుంటాను.

Out of topic ఇవన్నీ! నాకు కూడా నా స్వార్థమే ముఖ్యం! నా ఆనందం కోసం ఏదైనా చేస్తాను, ఆ ఆనందం డబ్బులో మాత్రం ఉండదని తెలుసు, ఐతేనేం ఎప్పటికైనా 100 కోట్లు సంపాదించగలననే నమ్మకం ఉంది. ఆ నమ్మకం నాకున్న “పిచ్చి” నుండి వచ్చింది. డబ్బులేకున్నా ఆనందం కోసం ఎన్నేళ్ళైనా పని చేస్తాను, ఆ ఆనందం లేని క్షణాన ఏమీ కోరుకోకుండానే మాయమవుతాను. త్యాగాలు, ఏడుపులు, పెడబొబ్బలు ఉండవు నా లోకంలో! అసహాయతతో మాత్రం సహజీవనం చేస్తుంటాను,ఈ అసహాయతే అప్పుడప్పుడు కన్నీటి ధార నా చెంపలను తడిపేలా చేస్తుంటుంది. పుట్టినందుకు ఏమీ చేయలేక పోతానేమో అనే భయంతో నిద్రలేని రాత్రులు కూడా గడిపేస్తుంటాను. ఎంతో తీవ్రమైన బాధళ్ళోనూ, చనిపోవాలనుకునే సంధర్భాలలోనూ నన్ను కాపాడింది ఈ ఏమీ చేయలేదనే బాధే! పుట్టినందుకు ఈ ప్రపంచానికి ఏదైనా చేసి పోవాలి, ఈ ప్రపంచాన్ని చూసి బాధపడి చనిపోతే నిన్ను అమరవీరుడని అనరు, చేతకాని దద్దమ్మ, చవట అంటారు నాకు తెలిసినంతవరకు..

మళ్ళీ వెర్రి జనం గుర్తొస్తున్నారు.. మా నాన్న గారి చిన్నప్పుడు ఒక యువజన సంఘం పెట్టి ఊరికి ఏవో మంచి పనులు చేసేవారంట! మూఢనమ్మకాల గురించి వివరిస్తూ దేవుడు లేడనే నిజం చెప్పేసరికి వాళ్ళకి మండి కొట్టాలని చూసారంట! మళ్ళీ చాలా ఏళ్ళకి అదే repeat అయింది. మడ్డువలస రిజర్వాయర్ కోసం వాళ్ళ ఉద్యమం ఫలించి ప్రభుత్వం 72 కోట్లు మంజూరు చేసిన ఆనందంలో రైతులు సన్మానించబోతే మళ్ళీ అదే రకం మనుషులు మా వాళ్ళపైన రాళ్ళు విసిరారంట! ప్రభుత్వ పాఠశాలలో అవినీతి జరుగుతోందని తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసే మనుషులు ఎందరుంటారు ఈ రోజుళ్ళో! ఒక రాజకీయ పార్టీ MLC స్థానానికి టికెట్ ఇస్తే ఇంటికి ఏకైక దిక్కని త్రుణప్రాయంగా వదిలేసే వాళ్ళెంతమంది? ఏమో, ఆయనలో కుటుంబంపైన, సమాజంపైన ఉన్న స్వార్ధమే అవన్నీ చేయించింది కాబోలు..!

మళ్ళీ అవుట్ ఆఫ్ టాపిక్కి వెళ్తున్నా! అసలు మనుషులు అబద్దాలు ఎందుకు చెప్తారో తలబద్దలయ్యేలా ఆలోచిస్తుంటాను! భయపడి చెప్తారో, భ్రమ పెట్టడానికి చెప్తారో లేక తామే భ్రమలో పడటానికి చెప్తారో అర్దం కాక చస్తుంటాను! మభ్య పెడుతూ మనిషి ఎన్ని రోజులు బ్రతకగలడు, బ్రతికినా ఆ బ్రతుకు ఎవరికి ఉపయోగం? నా మట్టుకు ఓదార్చే అబద్దం కన్నా బాధ పెట్టే నిజమే గొప్పది! ఒకరికి హాని కలిగిస్తుందంటే తప్ప నిజం చెప్పకపోవడంలో అర్దం లేదేమో! ఏమో, నావరకైతే మభ్యపెట్టడం, భ్రమ పడటం రెండూ పనికిమాలిన పనులు! నేనింతే.. నన్ను నన్నుగా accept చేయండి, లేదంటే పిచ్చ లైట్ అనే రకం నేను.

నాకున్న తిక్క గురించి చెప్పాలి కొంచెం! ప్రపంచాన్ని మర్చినోళ్ళంతా తిక్కోళ్ళే అని నా నమ్మకం! నేను నమ్మినదానికోసం ఏదైన చేసేంత తిక్క నాకు ఉంది. అమెరికా వాడు వీసా ఇవ్వకపోతేనేం, వాడే కాళ్ళ మీద పడి నన్ను రమ్మనే రొజు దాకా ఆ దరిద్రపు దేశాన్ని చూడనని చెప్పగలిగేంత తిక్కుంది నాకు. ఇలాంటి తిక్క ఉన్నందుకే పవన్ కళ్యాణ్, గంగూలీ లాంటి వాళ్ళకి అభిమానినయ్యాను. ఈ తిక్కోళ్ళు ఏ రంగంలో ఉన్నా వాళ్ళు తెచ్చే మార్పు మాత్రం అనితర సాధ్యం! సద్దాం హుస్సేన్ ఏ బలంతో అమెరికాలాంటి అహంకారపు అగ్రరాజ్యాన్ని ఢీ కొట్టాడు? ఇలాంటి నమ్మకమే నాకూ ఉంది, ఈ ప్రపంచాన్ని గెలవాలన్నంత తిక్క ఉంది!

ఈ ప్రపంచం మనం పడినన్ని రోజులూ మనల్ని పడదోస్తూనే ఉంటుంది, ఒక్కసారి తిరగబడితే చాలు తోక ముడుచుకుంటుంది. “Beep this world, else it will beep you!” నేను ఈ ప్రపంచానికి లొంగను, నేనే ఈ ప్రపంచాన్ని లొంగదీసుకొవలనుకుంటాను. నాకు భయం లేదు, అబద్దం చెప్పాల్సిన అవసరం లేదు! కులం, మతం లాంటి అవలక్షణాలు లేవు. ఇంకా చెప్పాలంటే భారతీయుడిననే గర్వమూ లేదు కేవలం బాధ్యత తప్ప! నేను ఒక తిక్కోడిని! అంతే!

Read Full Post »

అనుసరించు

Get every new post delivered to your Inbox.